అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం దగ్గరపడుతోంది. రామయ్య కీర్తి మనదేశంలోనే కాదు ఖండాంతరాలు దాటుతోంది. అమెరికాలో రోడ్డు పక్కన ఉండే బిల్ బోర్డ్స్ పైనా అయోధ్య రాముడి ప్రారంభోత్సవానికి సంబంధించిన చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి…
శ్రీ రాఘవం దశరథాత్మజమప్రమేయమ్
సీతాపతిం రఘుకులాంవయ రత్న దీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
రామయ్య కీర్తి ఖండాంతరాలు దాటుతోంది. అయోధ్యలో రామచంద్రుడు కొలువుతీరే క్షణాలకోసం దేశం యావత్తూ ఎదురుచూస్తోంది. ఇదే సమయంలో అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఉండే బిల్ బోర్డుల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రచార చిత్రాల ప్రదర్శన ఆసక్తి రేపుతోంది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతనిస్తూ విశ్వహిందూ పరిషత్‌కు చెందిన అమెరికన్ యూనిట్ అక్కడి పది రాష్ట్రాల్లో హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ మొత్తం 40 హోర్డింగ్‌లను ఏర్పాటు చేసినట్లు వీహెచ్‌పీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ , జార్జియా రాష్ట్రాల్లో ఈ బోర్టులు ఏర్పాటు చేశారు. అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 15 నుండి అరిజోనా, మిస్సోరీలలోని ఆలయాలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు.
రాముడి ప్రాముఖ్యత విదేశీయులకు తెలియాలి
అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అమెరికాలో నివసిస్తున్న హిందువులంతా వెళ్లేలా ప్రోత్సహించడం ఈ బిల్ బోర్డుల ముఖ్య ఉద్దేశమని అమెరికా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వెల్లడించారు. రాముడి ప్రాముఖ్యతను విదేశాల్లో చాటి చెప్పేందుకు కూడా బిల్ బోర్డులో ప్రదర్శించామన్నారు.
ప్రత్యక్ష ప్రసారానికి ప్రత్యేక ఏర్పాట్లు
న్యూ యార్క్ లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ లో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం మోదీ ప్రసంగాన్ని కూడా టైమ్ స్కైర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అయోధ్య ఆలయంలో జనవరి 22న జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఏడువేల మంది ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
అయోధ్య నగరం సర్వాంగ సుందరంగ ముస్తాబైంది.