దేశంలో సివిల్ సర్వీస్ పరీక్షల్లో పాసయిన వారికి పలు క్యాడర్లు కేటాయిస్తారు. ర్యాంకుల ఆధారంగా ఐపీఎస్, ఐఏఎస్ , ఐఆర్ఎస్ సర్వీసులు ఇస్తారు. ముస్సోరిలో ఐపీఎస్, ఐఏఎస్‌లకు శిక్షణ ఇస్తారు. అనంతపురంలో ఐఆర్ఎస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. కొన్ని వందలకోట్లతో నిర్మాణం అయిన ఈ ట్రైనింగ్ సెంటర్ ను ప్రధాని మోదీ పదహారో తేదీన ప్రారంభించబోతున్నారు.
ఉమ్మడి అనంతపురంకు కేంద్రం ఇచ్చిన వరరం నాసిన్
నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పూర్తి చేశారు. అకాడమీకి మొదటి దశలో రూ.729 కోట్లు ఖర్చు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో నాసిన్ అకాడమీని ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆ ప్రకారం 2015 ఏప్రిల్‌లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నాసిన్ అకాడమీ ఏర్పాటుకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం భూమిని హ్యాండోవర్ చేయడంలో ఆలస్యంకావడంతో నిర్మాణం ఆలస్యం అయింది. ఆ తర్వాత శరవేగంగా పూర్తి చేశారు.
ముస్సోరి తరహాలో అనంతపురం
ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో ఐఏఎస్ అధికారులు శిక్షణ పొందుతున్నట్లు, హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అకాడమీలో ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు పాలసముద్రంలోని నాసిన్ అకాడమీ ప్రపంచ ప్రమాణాలతో ఐఆర్ఎస్ ట్రైనీ అధికారులకు శిక్షణనిస్తుంది. అకాడమీకి భూములిచ్చిన రెండు గ్రామాల రైతులకు కేంద్రం పలు ప్రయోజనాలు కల్పించింది. అకాడమీ నిర్మాణానికి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు ఈ అకాడమీ వల్ల హిందూపురం, పాలసముద్రం ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరుగుతుంది.
16న ప్రారంభించనున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 16వ తేదీన పెనుకొండ నియోజకవర్గం పాలసముద్రంకు విచ్చేయనున్నారు. పాలసముద్రం వద్ద జాతీయ రహదారికి ఆనుకుని, నాసిన్ అకాడమీ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో జాతీయ స్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవం ఈనెల 16న నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ పాలసముద్రం పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ముందస్తుగా జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి లు శుక్రవారం నాసిన్ అకాడమీని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.