ప్రస్తుత సమాజంలో యువత ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక అస్తవ్యస్త జీవనశైలితో పెడదోవ తొక్కుతున్నది. యువత చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవిగా భావించుకుని ఆత్మన్యూనతా భావం, నిరాశ, నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ధీరత్వాన్ని యువకుల హృదయాల్లో ప్రతిష్టించడాన్ని వివేకానందుడు ఒక యజ్ఞంలా చేశారు.
యువతకు వెలుగు దారి చూపిన వివేకానంద
భయపడిన మరుక్షణం ఎందుకూ పనికిరాని వారవుతారు. మనకు కావలసింది బలం, కాబట్టి ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మీ నరాలను దృఢతరం చేసుకోండి. మనకు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం. విలపించినది ఇకచాలు, మీ కాళ్లపై మీరు నిలబడి మనుషులుగా ఎదగండి, లేవండి.. మేల్కొండి. గమ్యాన్ని చేరుకునే వరకూ ఆగకండి’ అని వివేకానంద యువతను జాగృతపరిచిన తీరు అమోఘం. అందుకే ఆ మహనీయుడి జన్మదినం జనవరి 12 ను భారత ప్రభుత్వం 1984లో ‘జాతీయ యువజన దినోత్సవం’గా ప్రకటించింది. మనం 1985 నుంచి వివేకానంద జయంతిని ‘జాతీయ యువజన దినోత్సవం’గా జరుపుకుంటున్నాం.
చరిత్రలో నిలిచిన చికాగో ప్రసంగం
గురువు రామకృష్ణ పరమహంస మరణానంతరం భారతదేశ పర్యటనలో అనేక విషయాలపై అధ్యయనం చేశారు. దేశ కాలమాన పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు. వివేకానందుడు భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేయాలని సంకల్పించారు. అందులో భాగంగా అమెరికా, చికాగో మహానగరంలో అడుగుపెట్టారు. 1893 సెప్టెంబర్ 11న విశ్వమత మహాసభలలో వివేకానంద ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణుడిని, సరస్వతీ దేవిని ప్రార్థించారు. పరమ పవిత్రమైన ఆయన హృదయాంతరాలలో నుంచి వచ్చిన విశ్వ మానవ సౌభ్రాతృత్వ భావనతో “నా అమెరికా దేశ ప్రియ సోదర సోదరీమణులారా!” అని స్వామీజీ తన మధుర కంఠస్వరంతో ప్రారంభించగా సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది. అక్కడున్న ప్రతి ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు ఆయన ఆరాధ్యుడయ్యాడు. ఆయన ప్రసంగించాక చెవులు చిల్లులుపడే శబ్దంతో హర్షధ్వానాలు దద్దరిల్లేవి. అనతికాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది.
భారత దేశ విలువల్ని ప్రపంచాన చాటిన స్వామీ వివేకానంద
ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని వివరించేవాడు. హిందూ మత విశిష్టతను చక్కగా తెలపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం,ఈ మూడు గుణాలతో ఆయన అందరి హృదయాలను గెలవగలిగాడు. వాదనలలో ఆయనను గెలవగలిగిన వారు లేరు. అటువంటివారు యుగానికి ఒకరే పుడతారు. పేదవారిని, రోగులను నారాయణుడితో పోల్చుతూ వారిని సేవించమని, మూర్ఖులకు అండగా నిలవమని, కుల, మత, వర్ణ, లింగ, జాతి, భాష, ప్రాంతీయ భేదాలన్నింటినీ పటాపంచలు చేసి మనిషిని మనిషిగా చూడాలనే సంఘ సంస్కర్త, సమాజ సేవకుడు వివేకానంద. ఆయన స్మరణతో యువత ఉత్తేజితులై దేశాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తారు.