గుంటూరు లోక్‌సభకు కొత్త ముఖాలే – పాత నేతలంతా ఫేడవుట్

గుంటూరు జిల్లాలో మూడు లోక్‌సభ స్థానాలకు టిడిపి, వైసిపి తరుఫున పోటీ చేసేందుకు అభ్యర్థుల కొరత వెంటాడుతోంది. ఆర్థిక భారం పెరగడంతో సీనియర్లు ముందుకు రావడం లేదు. ఎంపీగా గెలిచినా ఎమ్మెల్యేలకు ఉన్న ఆధిపత్యం ఎంపీలకు ఉండటంలేదనే వాదన కూడా లేకపోలేదు. ఎమ్మెల్యేలను కాదని ఎంపిలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించే పరిస్థితి కూడా లేకుండాపోయింది.

గల్లా జయదేవ్ పోటీకి దూరం

గుంటూరు లోక్‌సభకు పోటీ చేసేందుకు సిట్టింగ్‌ ఎంపి గల్లా జయదేవ్‌ ఈసారి ముందుకు రావడం లేదు. రెండు సార్లు గెలిచిన ఆయన ఈ సారి జిల్లా రాజకీయాల నుంచి వైదొలిగారని చెబుతున్నారు. ఆయన స్థానంలో టిడిపి అధిష్టానం బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. తెనాలి ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను గుంటూరు లోక్‌సభకు పోటీ చేయాలని పార్టీ అధిష్టానం సూచించగా ఆర్థిక భారం ఎక్కువ ఆయన సుముఖత చూపలేదని చెబుతున్నారు. తనకు తెనాలి అసెంబ్లీ స్థానంలోనే అవకాశం ఇవ్వాలని కోరారు. పార్టీకి చెందిన సీనియర్‌లకు ఎవర్ని సంప్రదించినా ఎంపిగా పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడంతో రాజకీయాలతో సంబంధం లేని కార్పొరేట్‌ రంగాలకు చెందిన వారిని తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.

ప్రచారంలోకి భాష్యం రామకృష్ణ పేరు

గురటూరు లేదా నర్సరావుపేటకు ప్రముఖ విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరును టిడిపి అధిష్టానం పరిశీలిస్తున్నారు. ఆయన అంగీకరించకపోతే భాష్యం ప్రవీణ్‌ పేరును పరిశీలించే అవకాశం ఉంది. నర్సరావుపేట లోక్‌సభకు కూడా టిడిపి అభ్యర్థిగా ఖరారు కాలేదు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ గుంటూరు నుంచి పోటీకి అంగీకరిస్తే భాష్యం కుటుంబంలో ఒకరిని నర్సరావుపేటకు పంపుతారని ప్రచారం మవుతోంది. వైసిపికి సంబంధించి గుంటూరు ఎంపి అభ్యర్థిగా ఎవ్వరూ ఖరారు కాలేదు. క్రికెటర్‌ అంబటి రాయుడు పార్టీలో చేరిన కొద్దిరోజులకే ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటి అయ్యారు.

రాయపాటి కుటుంబాన్ని పట్టించుకోని టీడీపీ

మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు 2014, 2019లో నర్సరావుపేట నుంచి పోటీ చేశారు. 2014లో గెలిచారు. 2019లో ఓడిపోయారు. ఆ తరువాత ఆయన వయోభారంతో రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించలేకపోయారు. దీంతో ఆయన కుటుంబం వెనుకబడిపోయింది. ఎవరికీ లోక్ సభ సీటు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు