ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన కూటమి కలిసి పని చేస్తున్నాయి. పోటీ చేయబోతున్నాయి. ఈ కూటమికి ఆశీస్సులు ఉండాలని అమిత్ షా , మోదీని సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ కల్యాణ్ కోరుతున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ ఎన్డీఏలో ఉన్నారు. బీజేపీ కూడా తాము పవన్ తో పొత్తులో ఉన్నామని చెబుతోంది. అంటే పవన్ కల్యాణ్ బీజేపీని వదులుకోలేకపోతున్నారు. టీడీపీతో కలిసేందుకు బీజేపీలో ఏకాభిప్రాయం లేదు. అదే సమయంలో టీడీపీ వైపు నుంచి ప్రతిపాదన రాకుండా బీజేపీ హైకమాండ్ పొత్తులకు వెళ్లే అవకాశం లేదు.
పొత్తుల కోసం బీజేపీని సంప్రదించాల్సిందే
దేశంలో అతి పెద్ద పార్టీగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా.. తమతో పొత్తుల కోసం రావాలని బీజేపీ పిలవదు. అందుకే బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలని కోరుకుంటున్న పార్టీలు మా అధిష్టానంతో మాట్లాడాలని సూచిస్తున్నారు. బీజేపీ పొత్తు కోరుకుంటున్నామని టీడీపీ నేతలతో పవన్ కూడా చెప్పించాల్సి ఉండాల్సింది. కానీ బీజేపీ ఎక్కడ ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుందోనని.. టీడీపీ, జనసేన తమంతట తాముగా పొత్తులు అడగడానికి ముందుకు రావడం లేదు.
అన్ని పార్టీలు బీజేపీకి అనుకూలమే
ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే బీజేపీకి ఎక్కువగా లాభం ఉంటుందన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు లేవు. ఏపీలో బీజేపీ బలంగా లేదని ఎవరు చెప్పారని.. ఏపీలో 25 మంది ఎంపీల్లో ఏ పార్టీ గెలిచినా బీజేపీ గెలిచినట్లేనని రాజకీయవర్గాలు సెటైర్లు వేస్తూంటాయి. ఇది నిజం కూడా. ఎందుకంటే ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీకి వ్యతిరేకంగా లేరు. పార్లమెంట్ లో అన్ని విధాలుగా మద్దతిస్తున్నారు. జనసేన పార్టీకి ఎంపీలు లేకపోయినా సపోర్ట్ మాత్రం.. బీజేపీకే ఉంటోంది. అన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగానే ఉన్నప్పుడు మరి బీజేపీ ఓ పార్టీతో పొత్తులకు వెళ్లాల్సిన అవసరం ఏమిటన్నది బీజేపీ పెద్దల అభిప్రాయం. అందుకే బీజేపీ చొరవ చూపించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు.
బీజేపీతో ప్రయోజనం అనుకుంటేనే రావొచ్చు..లేకపోతే లేదు !
తమ ప్రకటనల ద్వారా బీజేపీ హైకమాండ్.. టీడీపీ, జనసేన కు స్పష్టమైన సంకేతాలను పంపారు. అవసరం అనుకుంటేనే .. రావొచ్చని.. లేకపోతే ఎవరూ పట్టించుకోరని సందేశం పంపారు. ఏపీ బీజేపీలో కొంత మంది టీడీపీతో పొత్తునకు ఉత్సాహం చూపించినప్పటికీ.. టీడీపీ ముందుకు రాకపోతే ఎలా సాధ్యమన్న ప్రశ్న సహజంగానే వస్తోంది. ఈ మైండ్ గేమ్ తో .. టీడీపీ, జనసేన ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా కనిపిస్తోంది.