ఇండియా గ్రూపులో యాత్ర టెన్షన్

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలి విడత యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగింది. భారత్ జోడో యాత్ర పేరుతో ఆయన జనంలో వెళ్లడం, ఓ మోస్తరు స్పందన రావడం అందరికీ గుర్తుంది. ఈనెల 14 నుంచి మరోసారి క్రాస్ కంట్రీ యాత్రను రాహుల్ ప్రారంభిస్తున్నారు. మణిపూర్ నుంచి ముంబై వరకు సాగే భారత్ జోడే న్యాయ్ యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు ఈ యాత్ర పూర్తికావాలని, రాహుల్ విస్తృతంగా జనంలో తిరిగాలని కాంగ్రెస్ ఆకాంక్షిస్తోంది.

కాంగ్రెస్ తీరుపై అఖిలేష్ అభ్యంతరం…

కాంగ్రెస్ యాత్ర ఆ పార్టీ సొంత విషయమైనప్పటికీ ఇండియా గ్రూపు పట్ల నేతల వైఖరి మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. అవకాశం వస్తే ఇతర పార్టీలను మింగేసి మొత్తం స్పేస్ ను ఆక్రమించుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రను కొనసాగిస్తే సీట్ల సర్దుబాటు చర్చలు ఎప్పుడు జరుగుతాయని పొత్తు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ యాత్ర ప్రారంభానికి ముందే ఉత్తర ప్రదేశ్లోని 80 లోక్ సభా స్తానాలకు సంబంధించి సీట్ల సర్దుబాటు పూర్తి కావాలని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు అలయన్స్ ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చర్చలకు ప్రయత్నించి భంగపడిన ఆయన ఈ సారి ఎలాంటి అవకాశం తీసుకోదలచుకోలేదు. మొత్తం వ్యవహారాన్ని ఆదిలోనే ముగించేసి షెడ్యూల్ కు ముందే ప్రచారం నిర్వహించాలని ఆయన ఎదురుచూస్తున్నారు…

అన్ని పార్టీలదీ ఒకటే అభిప్రాయం…

కాంగ్రెస్ పార్టీ స్వార్థ చింతనతో, సొంత వ్యూహంతో ముందుకు వెళ్తోందని పొత్తు భాగస్వాములు అనుమానిస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా తాము మాత్రమే పోరాడుతున్నామని చెప్పుకునేందుకు రాహుల్ వీధుల్లోకి వస్తున్నారని జేడీయూ, తృణమూల్, ఆర్జేడీ లాంటి పార్టీలు అనుమానిస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించుకుండా ఉండాలంటే యాత్రకు ముందే పొత్తు చర్చలు పూర్తి కావాలని ఆయా పార్టీలు ఆకాంక్షిస్తున్నాయి. బిహార్, బెంగాల్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలో ఎవరెక్కడ పోటీ చేస్తారో నిర్థారించిన తర్వాతే యాత్రకు బయలుదేరాలని మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

మాయమాటలు చెబుతోందని అనుమానం…

కాంగ్రెస్ పార్టీ పొత్తుల వ్యవహారాన్ని తప్పుదోవ పట్టిస్తోందని కూడా ఇండియా గ్రూపు పార్టీలు అనుమానిస్తున్నాయి. రాహుల్ కేంద్రంగా యాత్ర సాగితే మైలేజీ మొత్తం కాంగ్రెస్ కే వస్తుందని వాదిస్తున్నాయి. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ చీఫ్ ముకుల్ వాస్నిక్ … వేర్వేరు పార్టీలతో చర్చలు జరుపుతున్నప్పటికీ అందులో చిత్తశుద్ధి లేదని జేడీయూ, ఆప్, ఎస్పీ డౌట్లు పడుతున్నాయి. యాత్రలో బాగంగా రాహుల్ అందరు నేతలను కలుస్తారని చెబుతున్నప్పటికీ ఎక్కువ ఫోకస్ ఆయన వైపే ఉండే విధంగా చూసుకుంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.