దిద్దుబాటుకు నానా తంటాలు పడుతున్న మాల్డీవ్స్

తమ మంత్రులు నోరు జారి భారత ప్రధాని నరేంద్ర మోదీని అనరాని మాటలు అన్న ఘటనలో మీల్దీవ్స్ ప్రభుత్వం పూర్తి ఇరకాటంలో పడిపోయింది. ఏ విధంగా పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నించినా భారత ప్రజలు మాత్రం మాల్దీవ్స్ నేతలను క్షమించే అవకాశాలు కనిపించడం లేదు. బాయ్ కాట్ మాల్దీవ్స్ నినాదం ఇంకా వేగం పుంజుకోవడంతో అక్కడి ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు.

మాల్డీవ్స్ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన అక్కడి మాజీ మంత్రి

ప్రస్తుతం సస్పెండ్ అయిన ముగ్గురు మాల్దీవ్స్ మంత్రుల తీరుపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లలో భారత రాయబారిని పిలిపించి వివరణ అడిగింది. దిద్దుబాటుకు దిగిన మాల్దీవ్స్ ప్రభుత్వం అక్కడి భారత రాయబారిని పిలిపించుకుని వివరణ ఇచ్చింది. జరిగినదానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది. మరో పక్క మాల్జీవ్స్ మాజీలంతా ప్రస్తుత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వంలోని కొందరు సంకుచిత దృక్పథంతో ప్రవర్తించాలని మాల్దీవ్స్ రక్షణశాఖ మాజీ మంత్రి మారియా అహ్మద్ దీదీ వ్యాఖ్యానించారు. రక్షణ,పర్యాటక,వైద్య రంగాల్లో మాల్దీవ్స్ కు భారత్ సాయం అందిస్తోందని మారియా గుర్తుచేశారు. రక్షణ రంగంలో మాల్దీవ్స్ స్వయం సమృద్ధి సాధించడం వెనుక భారత సహకారం ఉందని ఆమె ఒప్పుకున్నారు. మాల్దీవులకు ఎప్పుడు కష్టం వచ్చినా భారత్ అండగా నిలిచిందన్నారు..

కరోనా సమయంలో భారత్ సాయం

2021లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో మాల్దీవులకు భారత్‌ వ్యాక్సిన్లు అందించింది. భారత్‌ నుంచి వ్యాక్సిన్లు పొందిన తొలి దేశం కూడా అదేనని చెప్పాలి. వ్యాక్సిన్ల ఎగుమతి ఆంక్షలు, దేశీయ అవసరాలు ఉన్నప్పటికీ ఆ ఏడాది మూడు నెలల్లోనే 3 లక్షల డోసులు పంపించింది. మాజీ మంత్రి మారియా కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడే కాదు కొన్నేళ్లుగా భారత్‌ ఈ దేశానికి ఆపన్న హస్తం అందిస్తూనే ఉంది. కొవిడ్‌ సమయంలో వూహాన్‌ నుంచి మాల్దీవుల ప్రజలను తరలించడంలో సహాయం చేయడం.. మాలేకు వైద్య బృందాలను పంపడం.. హనిమధూ విమానాశ్రయ అభివృద్ధి.. ఇలా మాల్దీవులకు భారత్‌ చేసిన సహాయాల జాబితా చాలా పెద్దదే. అలాగే పలువురు మాల్దీవుల అధికారులు భారత్‌లోని వివిధ ఇనిస్టిట్యూట్‌లలో శిక్షణ పొందుతున్నారు. కరెక్టుగా చెప్పాలంటే నోరు జారిన మాల్దీవ్స్ మంత్రులకు ఈ సంగతి గుర్తులేదు. అందుకే రెచ్చిపోయి మాట్లాడి ఉంటారని అక్కడి ప్రజలే అంటున్నారు. మరో పక్క మాల్దీవ్స్ అభ్యర్థన మేరకే కొద్దిపాటి భారత సైన్యం అక్కడ ఉన్నది. దానిపై కొందరు రాద్ధాంతం చేస్తే అదీ వారి ఇష్టమనుకోవాల్సింది. సస్పెండైన ముగ్గురు మంత్రుల వ్యాఖ్యలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని అధికారిక ప్రకటన విడుదల చేయడం దిద్దుబాటు చర్యల కిందుకే వస్తుంది…

లక్షద్వీప్ పై పెరిగిన ఆసక్తి..

మాల్దీవ్స్ తీరుతో ఇప్పుడు భారత పర్యాటక కేంద్ర లక్షద్వీప్ పై మనవారిలో ఆసక్తి పెరిగింది. లక్షద్వీప్ గురించి తెలుసుకునేందుకు ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. 24 గంటల్లోనే అది 8 వేల 500 రెట్లు పెరిగిందని సోషల్ మీడియా లెక్కలు చెబుతున్నాయి. లక్షద్వీప్ పర్యాటకాన్ని ప్రమోట్ చేయడానికి అనేక ఏజెన్సీలు ముందుకు వస్తున్నాయి. సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి.