కేశినేని కుటుంబంలో టీడీపీ చిచ్చు – నానిని అవమానించి తమ్ముడికి సీటు !

టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా తనను తప్పించారని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కేశినేని నాని. మొదలైపోయింది. ఎప్పుడూ కేశినేని రాజకీయమే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. పార్టీ ఏదైనా ఆయన రూటే సెపరేట్‌. అందుకే జిల్లా పార్టీలో ఆయన మిత్రుల కంటే ప్రత్యర్థులే ఎక్కువ ఉంటారు. ఇది టీడీపీ అధినేతకు నచ్చలేదు.

కేశినేని నాని తమ్ముడిని ప్రోత్సహిస్తున్న టీడీపీ

మూడోసారి ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్న టైంలో టీడీపీ కేశినేని నానికి షాక్ ఇచ్చింది. ఆ స్థానంలో వేరే వ్యక్తికి చోటు ఇస్తామని మీరు జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతానికి ఈ విషయంలో అధినేత ఆదేశాలను పాటిస్తానని సోషల్ మీడియాలో ప్రకటించిన నాని ఎంత వరకు సైలెంట్‌గా ఉండగలరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సొంత సోదరుడు కేశినేని చిన్నిని పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని తరచూ వారిపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా బొండా ఉమ, దేవినేని ఉమను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించేవారు. నాని కన్నా దేవినేని ఉమకే చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చేవారు.

బీజేపీలోకి వెళ్తారని టాక్

నాని ప్రవర్తనలో మార్పు వచ్చిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. సమయం వచ్చినప్పుడుల్లా అధినాయకత్వంతోపాటు, స్థానిక లీడర్లపై చిందులు తొక్కుతుంటారు. ఒకానొక సమయంలో ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం నడిచింది. అప్పటికే బీజేపీలోకి వెళ్లిన టీడీపీ ఎంపీలతోపాటు ఈయన కూడా వెళ్తున్నారని అంతా అనుకున్నారు. ఏమైందో కానీ మళ్లీ వెనక్కి తగ్గారు. తాజాగా రెండు రోజుల క్రితం తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎంపీ స్థానాన్ని బీసీలకు ఇస్తే స్వాగతిస్తానని చెప్పిన ఆయన నీతిపరులకు మాత్రమే సపోర్ట్ చేస్తానన్నారు. లేకుంటే ఎవర్నీ గెలవనివ్వనంటూ మాట్లాడారు.

వైసీపీ నుంచి కూడా ఆఫర్ ఉందా ?

టీడీపీ ఎంపీ అయినప్పటికీ నాని వైసీపీ లీడర్లకు చాలా క్లోజ్‌. తరచూ వారితో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్లు. తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పు ఏంటని ప్రశ్నించే వాళ్లు. తనకు అందరూ మిత్రులేనని రాజకీయాలు వేరు అభివృద్ధి పనులు వేరు అంటూ వెల్లడించే వాళ్లు. వైసీపీ వాళ్లతో క్లోజ్‌గా ఉండటంతో కేశినేని నాని ఎప్పటికైనా ఆ గూటికి చేరుతారని చాలా మంది అనుకునే వాళ్లు. వెంటనే మళ్లీ చంద్రబాబు కార్యక్రమాల్లో కానీ, టీడీపీ ప్రోగ్రామ్స్‌లో ప్రత్యక్షమై యాక్టివ్‌ రోల్‌ పోషించే వాళ్లు. ఇలా అందర్నీ ఆయన కన్ఫూజ్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు దీనికి పుల్‌స్టాప్ పడే టైం వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

మొత్తంగా కేశినేని నాని తమ్ముడిని పావుగా వాడి… ఆయనను దెబ్బకొట్టారన్న అభిప్రాయం కృష్ణాజిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది.