జనసేనతోనే పొత్తు – తేల్చేసిన బీజేపీ – ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు !

తెలుగుదేశంతో పొత్తు గురించి ఏపీ బీజేపీ ఏ మాత్రం ఆసక్తికరంగా లేదు. అయితే జనసేనతో మాత్రం కలిసి నడవాలని భావిస్తోంది. ఈ అంశంపై బీజేపీ పదాధికారుల భేటీలో స్పష్టత వచ్చింది. టీడీపీతో పొత్తు ఉండాలా లేదా అన్నదానిపై హైకమాండ్ దే నిర్ణయమని.. ఏపీ బీజేపీ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. దీంతో హైకమాండ్ తీసుకునే నిర్ణయం పైనే ఆసక్తి ఏర్పడింది.

పొత్తుల కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారా ?

సీనియర్ నేత తరుణ్ చుగ్ ఏపీకి వచ్చారు. గురువారం కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఏపీలో పొత్తులతో వెళ్లాలా? లేదంటే ఒంటరిగా వెళ్లాలా? అన్న విషయంపై పార్టీ నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపి ఢిల్లీ నాయకత్వానికి తరుణ్ ఛుగ్ నివేదిక ఇవ్వనున్నారు. బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఆ పార్టీ ఉంది. అయితే పొత్తులవల్ల ఎవరికి లాభం? బీజేపీకి ఎంతవరకు మేలు కలుగుతుంది? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అనే విషయాలను అంచనావేసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

జనసేనకే చాయిస్ – బీజేపీ ఫైనల్ ఆప్షన్

పొత్తుకు అగ్రనాయకత్వం సుముఖంగా లేకపోతే జనసేన వైఖరి ఎలా ఉండబోతోంది? అనే విషయాన్ని కూడా విశ్లేషించనున్నారు. తరుణ్ ఛుగ్ ఇచ్చే నివేదికను బట్టి బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. అయితే చివరగా నరేంద్రమోడీ, అమిత్ షా నిర్ణయమే ఫైనల్ అవుతుంది. రానున్న రెండుమూడు రోజుల్లో పొత్తులకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేనతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు రాష్ట్రంలో ఇరుపార్టీలు సమైక్యంగా ఒక్క కార్యక్రమాన్నీ నిర్వహించలేదు. జనసేన కలిసి రాకపోవడమే దీనికి కారణం. దీనిపైనా నివేదికను హైకమాండ్ కు తరుణ్ చుగ్ ఇచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్ బలపడే ప్రయత్నాలపై బీజేపీలో అనుమానాలు

ఏపీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీద్వారా అడుగు పెడుతుండటంతో బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపడేందుకు కొన్ని అంతర్గత పార్టీలు ప్రయత్నిస్తున్నాయని నమ్ముతున్నారు. ఈ అంశంపై బీజేపీ దృష్టి పెట్టనున్నది.