డైవర్షన్ పాలిటిక్స్ కు దిగుతున్న కర్ణాటక కాంగ్రెస్

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారానికి వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో అనిశ్చితి, ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్ నేతలు సమస్యలను దారి మళ్లించేందుకు ఏదోక వివాదాన్ని సృష్టిస్తూనే ఉన్నారు. పైగా అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయి, అధికారదాహంతో కొందరు నేతలు గందరగోళ పరిస్థితులను ఆహ్వానిస్తున్నారు.

ఎమ్మెల్సీ హరిప్రసాద్ బాధ్యతారహిత వ్యాఖ్యలు

కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ పార్టీ గెలిచిన వెంటనే మంత్రి పదవిని ఆశించారు. సీఎం సిద్దరామయ్య ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దానితో పక్షం రోజులకు ఒక సారి ఏదోక వివాదాన్ని లేవనెత్తుతున్నారు. సిద్దరామయ్య దిగిపోయి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారంటూ ఒక దశలో ప్రచారం మొదలు పెట్టిన హరిప్రసాద్ తర్వాత అధిష్టానం హెచ్చరికలతో నోటీకి తాళం వేసుకున్నారు. ఇప్పుడు అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం దగ్గర పడుతున్న వేళ ఆయన పొంతన లేని వ్యాఖ్యలకు దిగుతున్నారు.. అయోధ్యలో కూడా గోధ్రా తరహా అల్లర్లు జరిగే అవకాశం ఉందని అందుకే ఉత్తర ప్రదేశ్ వెళ్లే యాత్రికులకు కేంద్రప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని ఆయన అంటున్నారు. 2002లో గోధ్రా రైలు దగ్ధం ఘటన తర్వాత ఘోరమైన మత ఘర్షణలు జరిగాయని అందుకే ఈ సారి కర్ణాటకలో అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హరిప్రసాద్ సూచిస్తున్నారు.

మోదీ రాకకు అభ్యంతరం

రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాకపై హరిప్రసాద్ అభ్యంతరం చెప్పారు. మనదేశంలో నలుగురు శంకరాచార్యలు ఉన్నారని హిందూ ధర్మపరిపాలనకు వాళ్లే పెద్దలని అంటూ మోదీ, అమిత్ షాలు ధర్మగురువులు కాదని ఆరోపించారు. వాళ్లు రాజకీయ నాయకులు మాత్రమేనన్నారు. నిజానికి తాము ధర్మగురువులమని మోదీ, అమిత్ షా ఎన్నడూ చెప్పుకోలేదు. రాజ్యాధినేతలుగా ప్రజలు తమకిచ్చిన కర్తవ్యాన్ని మాత్రమే వాళ్లు నిర్వర్తిస్తున్నారు. హిందూ ధర్మాన్ని రక్షిస్తూ మరింత పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు…

హరిప్రసాద్ అరెస్టుకు బీజేపీ డిమాండ్…

అల్లర్లు సృష్టించేందుకు కర్ణాటక కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. దేశం మొత్తం అయోధ్య వైపు చూస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్న వేళ.. హరిప్రసాద్ లాంటి నేతలు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని ఇట్టే అర్థమైపోయింది. వారి వల్ల సామరస్య వాతావరణం దెబ్బతిని నిజంగానే అల్లర్లు జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఆయన క్షమాపణ చెప్పాలని, విద్వేషాలు సృష్టిస్తున్నందుకు కర్ణాటక ప్రభుత్వం ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఇంకెవ్వరూ ఇలాంటి బాద్యతారహిత వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కర్ణాటక బీజేపీ సూచించింది. అయోధ్య సహా ఉత్తర ప్రదేశ్ అంతటా భద్రతను పటిష్టం చేసే దిశగా యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. జనవరి 22 కార్యక్రమం సాఫీగా సాగిపోతుందని విశ్వసిస్తున్నారు.