ఏపీకి తరుణ్ చుగ్ – పొత్తులపై నేడో రేపో బీజేపీ తుది నిర్ణయం !

ఆంధ్ర్రదేశ్ బీజేపీ వచ్చే ఎన్నికలకు వ్యూహం ఖరారు చేసుకోవడం ఖాయమంది. బీజేపీతో పొత్తుల కోసం ప్రాంతీయ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్డీఏలో చేరుతామని కబురు పెడుతున్నాయి. ఈ కారణంగా బీజేపీ హైకమాండ్.. తమ వద్దకు వచ్చిన ప్రతిపాదనలపై చర్చించారు. రాష్ట్ర నేతల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు కీలక నేతల్ని పంపుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న తరుణ్ చుగ్ ఏపీలోనూ కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.

పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయమేంటి ?

పొత్తులపై ఏపీ బీజేపీ నేతలుతమ అభిప్రాయాలను హైకమాండ్ కు చేరవేయనున్నారు. వారి అభిప్రాయానికి తగ్గట్లుగా కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కువ మంది నేతలు సొంతంగా పార్టీ ఎదగడానికి ప్రయత్నించాలంటే ఒంటరిగానే పోటీ చేద్దామని సూచించే అవకాశం ఉంది. పొత్తుల వల్ల పరిమితమైన సీట్లు ఇచ్చి బీజేపీకి బలం లేదని ప్రచారం చేయాలని అనుకుంటారని .. గతంలోనూ ఇలాగే జరిగిందని అంటున్నారు. ఈ అంశంపై అందరి అభిప్రాయాలు తీసుకుని తరుణ్ చుగ్ కేంద్ర పార్టీకి నివేదించే అవకాశం ఉంది.

బలమైన స్థానాల్లో పోటీకి ఇప్పటికే కార్యాచరణ

పొత్తులతో సంబంధం లేకుండా ఇప్పటికే బీజేపీ బలమైన స్థానాల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటోంది. పలు నియోజకవర్గాల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. హిందూపురంలో విష్ణువర్ధన్ రెడ్డి ప్రజా పోరాటాలు.. పార్టీల్లో చేరికలతో తీరిక లేకుండా ఉన్నారు. ఇలాంటి చోట్ల.. పొత్తులు మరింత బలం తీసుకు వస్తాయి కానీ.. .పొత్తుల పేరుతో ఇతర పార్టీలకు వదులుకోవడం వల్ల నష్టపోతామన్న అంచనాలు ఉన్నాయి. పొత్తులు వర్కవుట్ అయినా కాకపోయినా… పెద్ద ఎత్తున బీజేపీ బరిలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రత్యేక వ్యూహం

ఏపీలో బీజేపీ ఈ మధ్య కాలంలో బా గా బలపడిందని పార్టీ నేతలు నమ్ముతున్నారు. ప్రధాని మోదీ పాపులారిటీ ఏపీలో యాభై ఆరు శాతం ఉందని తేలడమే దీనికి కారణం. అయితే ప్రాంతీయ పార్టీలు అన్నీ వ్యూహాత్మకంగా బీజేపీకి దగ్గరే.. మోదీకి మద్దతుగానే ఉంటామన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో ఆ ఓట్లు బీజేపీ వైపు రావడం లేదు. మోదీ మద్దతుదారుల్ని బీజేపీ ఓట్లుగా మల్చుకునేందుకు హైకమాండ్ ప్రత్యేక వ్యూహం పాటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై తరుణ్ చుగ్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.