అన్ని కాలాల్లో కంటే చలికాలంలో చాలా మందికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చలిని కొందరు ఎంజాయ్ చేస్తారు కానీ మరికొందరు అస్సలు తట్టుకోలేరు. దీని వెనుకున్న కారణాలెన్నో. కొందరకి బ్లడ్ తక్కువగా ఉండటం వలన కూడా విపరీతమైన చలి ఉంటుంది. వింటర్ లోనే గుండెపోటు సమస్యలు పెరుగుతాయి. అందుకే వింటర్ లో కొన్ని ప్రత్యేకమైన ఫుడ్ ని మన డైలీ డైట్ లో చేర్చుకుంటే బాడీ హీట్ తో పాటూ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాల్లో బెల్లం ఒకటి. బెల్లాన్ని రోజుకో చిన్న ముక్క తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఐరెన్ కంటెంట్ ఎక్కువగా ఉండే బెల్లం పోషకాల ఘని. బెల్లం, నువ్వులు కలుపుకొని తింటే ఎంతో మేలు జరుగుతుంది. శీతాకాలంలో బెల్లం, నువ్వులు కలిపి లడ్డూల్లా చేసుకుని తింటే పోషకాలు అందడంతో పాటు శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రత లభిస్తుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
చలిని తట్టుకునే శక్తి ఇస్తుంది
బెల్లం తినడం వల్ల ఇనిస్టెంట్ ఎనర్జీ అందుతుంది. నువ్వులు తో కలిపి తినటం వలన ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు బాడీకి అందుతాయి. చెడు కొలెస్ట్రాల్ ని దరిచేరనివ్వదు. రక్తం శుద్ధి చేస్తుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు బెల్లం, నువ్వులు కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది. ఆయుర్వేదం లాంటి సాంప్రదాయ వైద్య విధానాల్లో బెల్లం, నువ్వులను శరీరానికి వెచ్చదనాన్ని అందించే పదార్థాలుగా చెబుతారు. ఈ ఆహారాలను తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పన్నమై ఎంతటి చల్లని వాతా వారణాన్ని అయినా తట్టుకునే విధంగా బాడీ తయారవుతుంది.
నువ్వులు-బెల్లం మిశ్రమం నిండా విటమిన్లే..
నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటివి అధికంగా ఉంటాయి. బెల్లంలో ఇనుము, పొటాషియం, మెగ్నీషియం విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. బెల్లంలో జీర్ణ లక్షణాలు ఎక్కువ. కాబట్టి జీర్ణ వ్యవస్థనూ మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నువ్వుల్లో ఉండే ఫైబర్, కూడా జీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుంది. నువ్వులు, బెల్లం కలిపి తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. బెల్లంలో ఉండే విటమిన్ సి, నువ్వుల్లో ఉండే నాన్ హీమ్ ఇనుము శోషణను పెంచుతుంది. ఐరెన్ లోపం ఉన్నవారు ప్రతిరోజు బెల్లం, నువ్వులతో చేసిన ఆహారాలను తినాలి. దీనిద్వారా రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు. నువ్వుల్లో సెసామిన్, సెసామాల్తో, అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను నశించకుండా కాపాడతాయి. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బెల్లం గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువే. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను సడెన్ గా పెంచదు. షుగర్ ఉన్నవారు చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల ఉపయోగం ఉంటుంది.