కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ పని చేసినా దేశ ప్రయోజనాలతో పాటు నూతన టెక్నాలజీల వినియోగానికి ప్రయత్నిస్తూనే ఉంది. పాత వాసనలు పోగొట్టి కొత్త అలవాట్లు, తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం పొందే ప్రక్రియలను పాటిస్తోంది. ఈ క్రమంలో డిజిటల్ టెక్నాలజీకి అవకాశం ఇస్తూ పేపర్ వర్క్ ను తగ్గించేందుకు దశలవారీగా చర్యలు తీసుకుంటోంది. కార్యాలయాల్లో మూలుగుతున్న పాత ఫైల్స్ ను మంగళం పాడుతోంది..
కార్యాలయాల్లో స్క్రాప్ విక్రయం
పాత ఫైల్స్, పాడుబడిపోయిన కార్యాలయ పరికరాలు, పాత వాహనాలను వేలం పద్ధతిలో విక్రయిస్తున్నారు. అక్టోబరు 2021 నుంచి ఈ క్రమంలో రూ.1,163 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. అందులోనూ ఈ ఏడాది అక్టోబరు నెలలో మాత్రమే రూ. 557 కోట్లు ఆదాయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్టలుగా పేరుకుపోయిన 96 లక్షల ఫైళ్లను విక్రయించారు. ఆ ఫైళ్లలో ఉన్న సమాచారాన్ని కంప్యూటరీకరించి డిజిటైజ్ చేయడం ద్వారా కీలకాంశాలను భద్ర పరచగలిగారు. దీనితో 355 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీ అయ్యింది. ఒకప్పుడు మట్టికొట్టుకుపోయిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు శుభ్రంగా కనిపిస్తున్నాయి. కారిడార్లను అందంగా తయారు చేసే అవకాశం వచ్చింది. కొన్ని చోట్ల రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటయ్యాయి.
రెండు చంద్రయాన్ల వ్యయంతో సమానం
రష్యా ప్రభుత్వ మూన్ మిషన్ కు రూ.16,000 కోట్లు ఖర్చయ్యింది. ఇస్రో నిర్వహించిన చంద్రయాన్ -3 ప్రయోగానికి ఖర్చయ్యిందీ కేవలం రూ. 600 కోట్లు మాత్రమే. హాలీవుడ్లో తీసే స్పేస్ మిషన్ సినిమాలకు కూడా రూ. 600 కోట్ల వరకు ఖర్చవుతుంది. కానీ మన ఖగోళ శాస్త్రవేత్తలు స్వయంగా చంద్రయాన్ మిషన్ కు కేవలం రూ. 600 కోట్లు ఖర్చయ్యింది. ఇప్పుడు స్క్రాప్ విక్రయం వల్ల వచ్చిన డబ్బుతో కనిష్టంగా రెండు చంద్రయాన్ మిషన్లు నిర్వహించే వీలుంది..
చెత్త తొలగింపుకు వారానికి 3 గంటలు కేటాయింపు
చెత్త ఫైళ్ల విక్రయంతో ఈ ఏడాది రూ. 557 కోట్లు సమకూర్చుకుంటే అందులో రైల్వేశాఖకు రూ. 225 కోట్లు అందింది. రక్షణ శాఖకు రూ. 168 కోట్లు, చమురు శాఖకు రూ. 56 కోట్లు, బొగ్గు శాఖకు రూ. 34 కోట్లు అందింది. ఈ క్రమంలో ఆ నాలుగు శాఖల్లోనే 164 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీ చేయగలిగారు. దాన్ని కార్యాలయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. పాత ఫైళ్లను ఈ ఫైళ్లుగా మార్చే ప్రక్రియ 96 శాతం పూర్తయ్యిందని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. స్వచ్ఛతా క్యాంపైన్ 3.0 పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వల్ల చెత్త తొలగిపోయి ఉద్యోగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతోంది. ప్రతీవారం మూడు గంటల పాటు ఉద్యోగులను ఈ పనికి కేటాయిస్తున్నారు. వచ్చిన ఆదాయాన్ని ఆయా శాఖలకే కేటాయించి వాటి అవసరాలకు వినియోగిస్తున్నారు.