షర్మిల ఏపీలోకి రాకతో ఎవరికి నష్టం ? ఈ ప్లాన్ ఎవరిది ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించిందని ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఇవ్వడానికి హస్తం అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ ఢిల్లీలో చర్చలు జరిపారని అంటున్నారు.

షర్మిల తెలంగాణలో రాజకీయం చేస్తారా ? ఏపీలో నా ?

షర్మిల తెలంగాణ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీవి విలీనం చేయాలనుకున్నారు. ఈ అంశంపై డీకే శివకుమార్ సాయంతో హైకమాండ్ తో చర్చలు జరిపారు. ఓ సారి ఢిల్లీకి వెళ్లి సోనియాతో కూడా సమావేశం అయ్యారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఆగిపోయారు. తర్వాత ఆమెను తెలంగాణ రాజకీయాల్లో కంటే.. ఏపీ రాజకీయాల్లో పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. షర్మిల వల్ల ఏపీలో పార్టీకి మేలు జరుగుతుందని సూచించారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ సంప్రదింపులు జరపడంతో ఏపీలో రాజకీయాలు చేసేందుకు అంగీకరించినట్లుగా చెబుతున్నారు. ఆయితే షర్మిల తెలంగాణలోనే రాజకీయాలు చేస్తారని ఖమ్మం లోక్ సభ టిక్కెట్ పై హామీతోనే పార్టీని విలీనం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ లో షర్మిల ఎంట్రీ ఏ పార్టీకి లాభం?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ జీరో అయింది. ఆ పార్టీలోని నేతలంతా వైఎస్ ఆర్సీపీ పార్టీలో చేరారు. మరి కొందరు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లన్నీ జగన్ వెంట తరలి వెళ్లాయి. 2014 నుండి ఇప్పటి దాకా ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ ఉనికే లేని పరిస్థితి. ఈ క్రమంలో జగన్ టార్గెట్ గా కాంగ్రెస్ షర్మిలను దింపుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కు తిరిగి లీడర్లు, క్యాడర్, ఓటు బ్యాంకు తరలి రావాలంటే అది జగన్ పార్టీ నుండే అని విశ్లేషిస్తున్నారు. ఇదే టార్గెట్ గా షర్మిల పని చేయనుందని… ఇది వైసీపీకి నష్టం చేస్తుందని అంచనా వేస్తున్నారు.

తెలంగాణను వదలనన్న షర్మిల ఇప్పుడేం చెబుతారు ?

తెలంగాణ రాజకీయాల్లో భాగంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. తాను తెలంగాణ కోడల్ని అని పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే అని, తాను తెలంగాణ పక్షపాతినని చెప్పుకున్న తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రయాణానికి ఆటకం అవుతుందేమో అన్న భయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. అంతే కాకుండా తాను తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తానని చెప్పడం, పోలవరం అయినా, పులిచింతల అయినా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతానని వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు ఏపీ ప్రజలకు తాను ఏపీ ప్రయోజనాల కోసం పోరాడతానని ఎలా చెప్తుందన్న ప్రశ్నలు వస్తున్నాయి.