వరుస ఓటములు కాంగ్రెస్ ను కృంగతీస్తున్నాయి.పార్టీదిశాహీనంగా ప్రయాణిస్తుందన్న భయం ప్రతీ ఒక్కరిలో ఉంది. కాంగ్రెస్ కు జనాదరణ కరువైందన్న అనుమానమూ సగటు కాంగ్రెస్ కార్యకర్తలు,నేతల్లో ఉంది.దీనితో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ప్రజలను ఆకట్టుకునేందుకు పార్టీ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.అందులో కొన్ని పాత పద్ధతులను కూడా కలిపేస్తోంది…
జనవరిలో భారత్ న్యాయ్ యాత్ర
యాత్ర పేరు మారింది. భారత్ జోడో యాత్ర ఈ సారి భారత్ న్యాయ యాత్రగా రూపాంతరం చెందింది. రాహల్ గాంధీ యాత్ర 2.0ను జనవరి 14 నుంచి ప్రారంభిస్తారు. ఆ రోజు మణిపూర్లో మొదలయ్యే యాత్ర… మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. హైబ్రిడ్ మోడ్ అంటే కొంత సేపు బస్సు, కొంత సేపు కాలినడకన ఈ యాత్ర ఉంటుంది. జనంతో కనెక్ట్ అయ్యేందుకు రాహుల్ వస్తున్నారని, అది రాజకీయ యాత్ర కాదని చెప్పుకునేందుకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రయత్నించారు . ఈశాన్యం నుంచి పడమటి తీరం వరకు ప్రతీ ఒక్కరినీ పలుకరించాలని రాహుల్ సంకల్పించినట్లు ఆయన వెల్లడించారు..
జోడో యాత్రకు స్పందన అంతంతమాత్రం
సామూహిక ఉద్యమంగా భారత్ జోడో యాత్రను నిర్వహించాలనుకున్నారు. రాహుల్ గాంధీని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిపించడమే కాంగ్రెస్ పార్టీ ఉద్యమం.యువనేత పేరు చెప్పి ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా నేతలు పనిచేశారు. 2022 ఆగస్టు 23న యునైటెడ్ ఇండియా మార్చ్ అంటే భారత్ జోడో యాత్ర పేరుతో లోగోను విడుదల చేశారు. గతేడాది సెప్టెంబరు 7న కన్యాకుమారి నుంచి మార్చ్ ప్రారంభమైంది. 12 రాష్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా నడిచిన రాహుల్ జనవరి చివర్లో కశ్మీర్ చేరుకుని తన భారత్ జోడో యాత్రను ముగించారు. పబ్లిసిటీ కోసం కొందరు వీఐపీలు వచ్చి యాత్రలో కాసేపు నడవడం మినహా.. సామాన్యులకు అవకాశం ఇవ్వలేదన్న ఆరోపణలువచ్చాయి. సామాన్యులు కూడా యాత్ర పట్ల ఆసక్తి చూపలేదన్న విశ్లేషణలు, విమర్శలు వినిపించాయి. పైగా అక్కడకక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు యాత్ర పేరు చెప్పి వసూళ్లకు పాల్పడిన ఘటనలు నమోదయ్యాయి. అలాంటివి కర్ణాటకలో ఎక్కువగా కనిపించాయి. పైగా ఎక్కడిక్కడ ఫోటో ఆపర్చునిటీగా వినియోగించారే తప్ప… ప్రజల్లో మమేకమయ్యేందుకు యాత్రను వాడుకోలేదన్న అపవాదూ ఉంది..
మూడు రాష్ట్రాల ఓటమితో కుదేలు..
భారత్ జోడో యాత్ర తర్వాత మూడు కీలక ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. తెలంగాణ విజయం ఒక ఊరటనిచ్చే అంశమైనా కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ఉత్తరాది విజయం తప్పనిసరి అవుతుంది. దానితో జోడో యాత్ర ప్రయోజనాలు కాంగ్రెస్ కు చేరలేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా ఇండియా కూటమిలోనూ విభేదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండో విడతగా భారత్ న్యాయ్ యాత్రను ప్రారంభిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో…