హిందూపురంలో బాలకృష్ణ మకాం – క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నమా ?

సార్వత్రిక ఎన్నికలపై హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ సాధారణంగా హిందూపురం నియోజకవర్గం పర్యటనకు వస్తే ఆ పార్టీ శ్రేణులు, మీడియాకు ముందస్తు సమాచారం అందుతుంది. తాజాగా ఆయన అకస్మికంగా నియోజకవర్గంకు వచ్చారు. చిలమత్తూరులోని ఓ ప్రయివేటు కేంద్రంలో నియోజకవర్గ నేతలతో పంచాయతీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది.

టీడీపీ క్యాడర్ వైసీపీలో చేరుతుందని ప్రచారం

వైసిపి రాయలసీమ కన్వీనర్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనలో టీడీపీ క్యాడర్ వైసీపీలో చేరుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ముందస్తుగా బాలకృష్ణ టిడిపి నాయకులతో పంచాయతీల వారిగా సమీక్ష పెట్టడం ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగానే తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి పర్యటనలో వైసిపిలోకి టిడిపి నుంచి పెద్దఎత్తున వలసలు ఉంటాయని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వారి పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్తుపై భరోసా కల్పించే చర్యలకు ఉపక్రమించారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా టిడిపి నాయకులు తమ పార్టీలోకి వస్తారని వైసిపి భావిస్తుండగా వారి పార్టీకి చెందిన శెట్టిపల్లి పంచాయతీ నాయకుడు హనుమంతరెడ్డి టిడిపిలో చేరారు.

నేతల్ని బుజ్జగిస్తున్న బాలకృష్ణ

మంత్రి పెద్దిరెడ్డి హిందూపురంపై దృష్టి పెట్టారు. చేరికలకోసం టీడీపీ నేతలతో మాట్లాడేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించారు. పెద్దిరెడ్డి రాజకీయానికి విరుగుడు.. బాలకృష్ణ ప్రారంభించారు. హిందూపురంలో టీడీపీ నేతల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. వారేదో లక్షలు ఇస్తామంటారని…. పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మారిపోతే… నష్టపోతారని చెబుతున్నారు. మీరు ఆ పార్టీలోకి వెళ్తే మీ ప్రత్యర్థులు టీడీపీలోకి వస్తారని అనివార్యంగా వారికి ప్రోత్సాహం ఇవ్వాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో వెళ్తామనే నేతల్ని ఆయన ఒత్తిడి చేయడం లేరు.. వారు వైసీపీలోకి వెళ్తే అక్కడ నష్టపోయేవారిని టీడీపీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

హిందూపురం రాజకీయం గరంగరం

హిందూపురంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత మరో పార్టీ గెలవలేదు. అలాంటి కంచుకోటలో.. భారీ ఎత్తున రాజకీయం జరుగుతోంది. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టలనుకుంటున్న వైసీపీ.. కాపాడుకోవాలనుకుంటున్న బాలకృష్ణ.. .తమ తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో ఎన్నికలవైపు తేలనుంది. మరో వైపు బీజేపీ ఈ నియోజకవర్గంలో చాపకింద నీరులా బలం పెంచుకుంటోంది.