బొబ్బిలిలో రాజులు ఆయుధాలు కోల్పోయారా ? – మళ్లీ గెలుస్తారా ?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బొబ్బిలిది ఓ ప్రత్యేకమైన స్థానం. అక్కడ బొబ్బిలి రాజుల కుటుంబానిదే హవా. కానీ గత ఎన్నికల్లో అక్కడ వారు ఓడిపోయారు. ఆ తర్వాత బొబ్బిలి రాజుల్లో పెద్దవాడయిన సుజయకృష్ణరంగారావు సైలెంట్ అయ్యారు. ఆయన సోదరుడు బేబినాయన యాక్టివ్ అయ్యారు. టీడీపీ తరపున ఆయనే పోటీ చేయబోతున్నారు.

టీడీపీలో చేరి ఓడిపోయిన బొబ్బిలి రాజులు

ప్రజాస్వామ్యంలో రాజులు ప్రజలే. దానికి తగ్గట్లుగానే బొబ్బిలి రాజులు మారిపోయి.. ప్రజాభిమానం పొందుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ ప్రజాభిమానం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో బొబ్బిలి కేంద్రంగా రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. బొబ్బిలి మున్సిపాలిటీతో పాటు రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యే ఉండనుంది. ఇక్కడ మళ్లీ పాగా వేసేందుకు ఓ పక్క బొబ్బిలి రాజులు ఉవ్విళ్లూరుతుండగా.. బొబ్బిలి కోటపై మళ్లీ వైసీపీ జెండా రెపరెపలాడించాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు.

అన్నదమ్మల మధ్య సీటు గొడవలు

బొబ్బిలి రాజులు సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీనాయనలు కూడా రాజకీయంగా తమ ప్రాంతంలో మంచి పట్టుసాధించారు. బొబ్బిలి రాజులు టీడీపీలో చేరడంతో అప్పటి వరకూ టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడును వైసీపీ నేతలు తెరపైకి తెచ్చారు. కొప్పలవెలమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గంలో అదే సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడును బరిలోకి దించి బొబ్బిలి రాజు సుజయకృష్ణరంగారావును ఓడించగలిగారు. అయితే భారీ మెజార్టీ రాలేదు. ఎనిమిది వేల ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. ఈ సారి టీడీపీ తరపున సుజయకృష్ణ రంగారావు కాకుండా ఆయన సోదరుడు బేబినాయన పోటీ చేయడం ఖాయమని భావిస్తున్నారు.

తమ్ముడితే పైచేయి

బేబీనాయనకు రాజకీయంగా నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది. బొబ్బిలి రాజ వంశీయులు కావడం, రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుండటంతో అందరికీ తలలో నాలుకలా మారారు. ఓ విధంగా చెప్పాలంటే నియోజకవర్గంలో అన్న సుజయకృష్ణ రంగారావు కంటే బేబీనాయనకే గట్టి పట్టు ఉంది. అన్నమాట తమ్ముడు జవదాటడు అన్న పేరుంది. ఇన్నాళ్లూ అన్నకు రాజకీయ అండగా నిలిచిన బేబీనాయన.. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.