తినే ఆహారంలో సీజన్ ప్రకారం మార్పులు చేర్పులు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో అరుగుదల తక్కువగా ఉంటుంది. అందుకే త్వరగా అరిగే ఆహారాలు తీసుకోవాలి కానీ అలా రాయిలా కడుపులో పేరుకుపోయేవి కాదు. ముఖ్యంగా చలికాలంలో తినకూడని ఆహారాలేంటో తెలుసుకుందాం…
వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలి చంపేస్తోంది. పొద్దెక్కినా ముసుగుతీయాలని అనిపించదు. పెద్దగా ఆకలి వేయదు. తిన్నది కూడా అలాగే కడుపులోనే ఉన్నట్టు బరువుగా అనిపిస్తుంటుంది. అంటే బయటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ శరీరంలో చురుకుదనం లోపిస్తుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అందుకే చలికాలంలో తొందరగా అనారోగ్యం బారిన పడుతుంటారు. అయితే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం వల్ల అనారోగ్యాన్ని దరిచేరనీయకుండా చేయొచ్చంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా చలికాలం ముగిసేవరకూ వీటి జోలికి పోవద్దు…
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు
కేక్ లు, తియ్యటి పదార్ధాలు, పండ్ల రసాలు, శీతల పానీయాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. ఇవన్నీ శరీరానికి శత్రువులు. రోగనిరోధక శక్తి బలహీనపరుస్తాయి. అందుకే వీటికి ఎంతదూరంగా ఉంటే అంత మంచిది.
ఫ్రిజ్ లో దాచినవి అస్సలు ముట్టుకోవద్దు
బద్దకంతో ఎక్కువగా వండేసి రోజుల తరబడి ఫ్రిజ్ లో పెట్టి దాచుకుని తినే అలవాటు చాలామంది ఉంది. ఇలాంటి పనులే మీ ఆరోగ్యంతో ఆడేసుకుంటాయి. ఫ్రిజ్ లో నుంచి తీసిన ఆహారాన్ని ఎప్పుడూ నేరుగా తీసుకోరాదు. వేడి చేయడం మరింత డేంజర్. కాసేపు బయట ఉంచి. వాటి చల్లదనం తగ్గిన తర్వాత తినాలి. వాస్తవానికి ఫ్రిజ్ లో పెట్టినవి తినడమే సరికాదు.
వేపుడు, ఆయిల్ ఫుడ్స్ కి దూరం దూరం
వేపుడులు ఎంత రుచిగా ఉంటాయో ఆరోగ్యానికి అంత హానికరం. ఇంకా అయిల్స్ ఫుడ్స్ లో కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. వీటిని తింటే బరువు పెరగడంతో పాటూ ఆస్తమా ,ఇతర ఇన్ఫెక్షన్‌లకు గురికావాల్సి వస్తుంది.
ఇవి కూడా తినొద్దు
గుడ్లు, పుట్టగొడుగులు, టొమాటోలు, పెరుగు వంటి ఆహారాలు శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతాయి. మాంసాహారం ,ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవటం వల్ల అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. శారీరక శ్రమ చేయని వారు వాటిని తినకుండా ఉండటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: కొందరు పండితుల నుంచి, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.