అయోధ్య రాముడికి భాగ్యనగర తలుపులు!

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2,500 ఏళ్లు తట్టుకుని నిలబడేలా దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా అష్టభుజి ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దుతున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ టింబర్‌ కంపెనీ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకుంటోంది. ఇంతకు మించిన అదృష్టం ఏముందంటున్నారు ఆ టింబర్ కంపెనీ యజమాని శరత్ బాబు..

అయోధ్య ఆలయానికి హైదరాబాద్ తలుపులు
అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్‌, ఫర్నీచర్‌, సామగ్రిని సేకరించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ టింబర్‌ కంపెనీ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకుంది. రామమందిరం కోసం వినియోగించనున్న తలుపులను హైదరాబాద్‌లో తయారు చేస్తున్నారు. సికింద్రాబాద్ న్యూబోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్‌లో వీటిని రూపొందిస్తున్నారు. ఇందుకోసం నిపుణులైన కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. చూడముచ్చటైన శిల్పాలతో అందంగా చెక్కుతున్నారు.

బల్షార్షా నుంచి టేకు
అయోధ్యలోని రామమందిరం కోసం, ఆలయ ప్రాంగణానికి అవసరమైన 100కు పైగా తలుపులను తాము తయారు చేస్తున్నామని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్‌ సంస్థ యజమాని శరత్ బాబు తెలిపారు. బల్లార్షా నుంచి తెచ్చిన టేకునే వాడుతున్నామన్నారు. అందులో కూడా అధిక నాణ్యత కలిగిన కలపను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడటంతో పనిలో వేగం పెంచామన్నారు. ఈ అవకాశం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు యజమాని

జనవరి 22 న రామమందిరం ప్రారంభం
జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరగనుంది. జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మంచి ముహూర్తం ఉందని జ్యోతిషులు వివరించారు. ఈ రామాలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. లక్షలాది మంది భక్తులు అయోధ్య చేరుకునేందుకు ముందే ప్లాన్ చేసుకుంటున్నారు. రాములోరిని చూసేందుకు తండోపతండాలుగా జనం వస్తుండటం, వీవీఐపీల రాక కూడా ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.