బెంగళూరులో మళ్లీ భాషా వివాదం..

దేశం మనందరిదీ,ఎవరు ఎక్కడైనా స్థిరపడొచ్చు, నచ్చిన భాష మాట్లాడొచ్చు. ఇతరులకు ఇబ్బంది కలగనంతవరకు ఏ భాషైనా మాట్లాడొచ్చన్నది జగద్విదితమైన విధానం. కొన్ని సందర్భాల్లో మాత్రం దాన్ని ఉల్లంఘిస్తూ నేతలు, పార్టీలు, ప్రభుత్వాలు నిర్భంధ భాషా విధానాలు సృష్టిస్తుంటాయి. ఈ క్రమంలో జాతీయ భాష వర్సెస్ ప్రాంతీయ భాష వివాదం తెరపైకి వస్తుంది. కర్ణాటకలో ఇప్పుడు అలాంటి సమస్యే తలెత్తుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి…

షాపుల బోర్డులపై 60 శాతం కన్నడ ఉండాలి..

బెంగళూరు కార్పొరేషన్ తాజాగా ఒక ఉత్తర్వు జారీ చేసింది. నగరంలోని షాపులన్నింటిపైనా ఉండే నేమ్ బోర్డుల్లో అరవై శాతం స్పెస్ కన్నడ భాషలో నింపాలని ఆదేశించింది. అంటే ఇంతకాలం ఇంగ్లీష్ బోర్డు మాత్రమే ఉంటే అందులో ఇంగ్లీష్ ను 40 శాతానికి తగ్గించి… దానిపై 60 శాతం మేర కనిపించేలా కన్నడలో షాపు పేరు ఉండాలి. అలా చేయని పక్షంలో చట్టపరమైన చర్యలుంటాయని బృహత్ బెంగళూరు మహానగర పాలికే చీఫ్ కమిషనర్ తుషార్ గిరి నాథ్ మీటింగ్ పెట్టి మరీ ప్రకటించారు.

జోన్ల వారీగా సర్వేకు రంగం సిద్ధం

కన్నడ పేర్లు అమలు చేసేందుకు జోన్ల వారీగా సర్వేలు చేస్తారు. అంటే నగర పరిధిలోని 1400 కిలోమీటర్ల రోడ్లకు ఇరువైపులా ఉన్న షాపులను చూసి 60 శాతం కన్నడ రూల్స్ ని అమలు చేయని వారికి నోటీసు ఇస్తారు. నోటీసుకు స్పందించి ఫిబ్రవరి 28 లోపు బోర్డులు మార్చెయ్యాలి. అలా చేయని పక్షంలో ఆయా షాపుల లైసెన్సులు రద్దు చేస్తారు.

అప్పుడే రంగంలోకి దిగిన కేఆర్వీ

ప్రభుత్వం ఇలా ప్రకటన చేసిందో లేదో కన్నడ రక్షణా వేదికే (కేఆర్వీ) రంగంలోకి దిగింది. వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాలంటూ షాపులపై జులుం ప్రదర్శించడం మొదలు పెట్టింది. కొందరు కేఆర్వీ మద్దతుదారులు వాహనాలపై తిరుగుతూ మైకుల్లో కన్నడ రూలును అమలు చేయాలని ప్రకటనలు ఇస్తూ కనిపించారు. వాళ్లు ప్రత్యేకంగా మార్వాడీల ప్రస్తావన చేశారు. ” ఇది కర్నాటక. కన్నడీగులు ఈ రాష్ట్రానికి గౌరవ మర్యాదలు తెచ్చిపెడతారు. మీ గొప్పదనాన్ని మీ రాష్ట్రాలకు వెళ్లి చూపించుకోండి. కన్నడ తెలియదని మరోసారి చెబితే మిమ్మల్ని టార్గెట్ చేయడం ఖాయం,” అంటూ మైకుల్లో ప్రకటిస్తూ వెళ్లారు. అయితే షాపుల యజమానులు మాత్రం తాము ఎలాంటి ధిక్కారానికి పాల్పడ దలచుకోలేదని, ప్రభుత్వ ఉత్తర్వులను తూచ..తప్పకుండా అమలు చేస్తూ 60 శాతం కన్నడ బోర్జులను పెడతామని వారు తేల్చేశారు.

సిద్దరామయ్య మద్దతు ఉందా…

కన్నడ ఉత్తర్వులకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య మద్దతు ఉన్నట్లుగా భావిస్తున్నారు. గతంలో కూడా కన్నడ అమలును సమర్థిస్తూ ఆయన ప్రసంగాలు చేశారు. తమిళనాడు, కేరళ, ఉత్తర ప్రదేశ్లో ప్రాంతీయ భాషల అమలు జరుగుతోందని ఆయా భాషలు రాకుండా అక్కడ ఉండలేరని ఆయన చెప్పుకొచ్చారు. కన్నడీగులు మాత్రం మాతృభాష కంటే ముందు ఇతర భాషలను నేర్చుకుంటున్నారన్నారు. గతంలో సీఎంగా చేసినప్పుడు కూడా కన్నడను విస్తృతంగా మాట్లాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. దానితో బ్యాంకు అధికారులంతా ఆరు నెలల్లో కన్నడం నేర్చుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అప్పట్లో బెంగళూరు మెట్రో స్టేషన్ కు ఉన్న హీందీ పేరును టేపుతో అంటించేశారు. ఈ సారి అంతకంటే దృఢంగా కన్నడ భాషను అమలు చేస్తారని భావిస్తున్నారు..