పాకిస్థాన్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ…

పాకిస్థాన్ అంటే ముస్లింలు మాత్రమేనన్న పేరుంది. హిందువులందరినీ బలవంతంగా మత మార్పిడులు చేస్తారన్న టాక్ ఉంది.దానితో భయపడి చాలా మంది ఇండియా వచ్చేస్తున్నారని కూడా లెక్కలు చెబుతున్నాయి. పాకిస్థాన్లో హిందువుగా బతకడం కష్టమేనన్న చర్చ చాలా రోజులుగా సాగుతోంది. అలాంటి పరిస్థితులను ఎదురీది ఓ హిందూ మహిళ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. పోరాడితేనే విజయం సాధ్యమని,పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని ఆమె ప్రచారం చేస్తోంది…

ఖైబర్ పఖ్తూన్వాలో సవీరా ప్రకాశ్ పోటీ

ఆమె పేరు సవీరా ప్రకాష్. చిన్న ప్రాంతం ఖైబర్ పఖ్తున్వాలోని బునేర్ జిల్లా నియోజకవర్గం నుంచి పాకిస్థాన్ పార్లమెంటుకు(నేషనల్ అసెంబ్లీ) ఆమె పోటీ చేస్తున్నారు. సాధారణంగా మహిళలకు కేటాయించిన స్థానాల్లోనే వారు బరిలోకి దిగడం ఆనవాయితీగా వస్తోంది. సవీరా మాత్రం జనరల్ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. అదీ విపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) తరపున ఆమె రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 8న పాక్ జనరల్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండగా పీకే -25 అని పిలిచే బునేర్ స్థానంలో ఆమె ఇప్పటికే నామినేషన్ వేశారు.

మహిళలు పోరాడాలంటున్న సవీరా…

సవీరా వైద్య విద్య చదివారు. డాక్టర్ గా మంచి పేరుంది. సామాజిక సేవలో తరిస్తూ ఖైబర్ ప్రాంతంలో అందరికీ పరిచయమయ్యారు. నిజాయతీగా పనిచేస్తారని జనంలో విశ్వాసమూ కలిగింది. అందుకే ఆమె ధైర్యంగా బరిలోకి దిగారని చెప్పాలి.ఛాందసవాదులకు తలొగ్గి కూర్చుంటే ప్రయోజనం ఉండదని ఆమె గ్రహించారు. పోరాడితేనే హిందువులకైనా, మహిళలకైనా హక్కుల సాధన కుదురుతుందని ఆమె చెబుతుంటారు. హిందువులు భయపడ ఇళ్లలో కూర్చునే రోజులు పోయాయని ఆమె చెబుతుంటారు. సమీర ప్రాంతీయంగా పీపీపీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి ఓం ప్రకాష్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన 35 ఏళ్లుగా పీపీపీలో ఉంటూ ప్రజాసేవలో అంకితమయ్యారు. నాన్నే తన స్ఫూర్తి అని సవీరా తరచూ చెప్పుకుటారు.

భారత ప్రధాన మోదీ వారికి ఆదర్శం

పాకిస్థాన్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక, సామాజిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రధాని మోదీ కూడా తమను పాలిస్తే సంక్షోభం నుంచి బయట పడతామని ఇటీవలి కాలంలో చాలా మంది పాకిస్థానీయులు వ్యాఖ్యానించారు. సవీరాకు కూడా మోదీ అన్నా, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలన్నా చాలా ఇష్టమని చెప్పక తప్పదు. భారతీయులు ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారని పాకిస్థాన్ ప్రజలు విశ్వసిస్తారు. అందుకే తమకు కూడా అలాంటి నాయకులు కావాలని కోరుకుంటారు. పాక్ సంప్రదాయ రాజకీయ నాయకుల పట్ల విసుగు చెంది తామే నాయకత్వం వహించాలనుకునే సవీరా ప్రకాష్ లాంటి వారికి అక్కడి ప్రజలు పట్టం కడతారో లేదో చూడాలి…