దావూద్ పై కేంద్రం ఉక్కుపాదం..

దావూద్ అనగానే గుర్తొచ్చేదీ అండర్ వరల్డ్ డాన్ . అతని పూర్తి పేరు దావూద్ ఇబ్రహీం కస్కర్. ముంబై పేలుళ్ల సూత్రధారిగా ముద్ర పడిన దావూద్ ఇండియాలో మోస్ట్ వాంటేడ్. చాన్నాళ్ల క్రితం పాకిస్థాన్ పారిపోయి అక్కడే తలదాచుకున్న దావూద్ ఇబ్రహీంపై అనేక కథనాలు ప్రచారమవుతుంటాయి. ఏది నిజమో..ఏది అబద్దమో కూడా తెలుసుకోనే అవకాశం లేని పరిస్థితుల్లో అనేక ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. వీటన్నింటినీ పట్టించుకోకుండా దావూద్ నేర సామ్రాజ్యంపై ఉక్కుపాదం మోపేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది.

జనవరిలో దావూద్ ఆస్తుల వేలం…

ముంబై అండర్ వరల్డ్ కార్యకలాపాలతో దావూద్ ఇబ్రహీం చాలా ఆస్తులనే సంపాదించాడు. అతడ్ని అప్పగించేందుకు పాక్ ప్రభుత్వం నిరాకరిస్తూ, తమ దేశంలో లేడని చెబుతున్న తరుణంలో అతని నేర సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మహారాష్ట్ర సర్కారు, భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయి. దేశంలో ఉన్న దావూద్ ఆస్తులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుంటున్నాయి. వేలం వేస్తున్నాయి. తాజాగా వచ్చే ఏడాది జనవరి 5న కొన్ని ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. ముంబై, రత్నగిరిలో ఈ ఆస్తులున్నాయి. స్మగ్లర్లు, విదేశీ మారకద్రవ్య నియంత్రణా చట్టం కింద రత్నగిరిలోని ఖేదా తాలూకాలో బంగ్లాలు, మామిడి తోటలను స్వాధీనం చేసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరి 5 నుంచి వాటిని వేలానికి పెడుతోంది.

2020లోనూ వేలం నిర్వహించిన ప్రభుత్వం…

2020 డిసెంబరులో కూడా రత్నగిరిలోని దావూద్ ఆస్తులను ప్రభుత్వం వేలం వేసింది. వాటిలో రెండు ఇంటి స్థలాలు, మూసివేతకు గురైన పెట్రోల్ పంపు ఉంది. వాటి విలువ కోటి పది లక్షలని అప్పట్లో లెక్కగట్టారు. చనిపోయిన దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ పేరుతో ఈ ఆస్తులను రిజిష్టర్ చేసి ఉంచారు. దావూద్ రెస్టారెంటును రూ.4.53 కోట్లకు, ఆరు ఫ్లాట్స్ ను రూ. 3.53 కోట్లకు, ఒక గెస్ట్ హౌస్ ను రూ. 3.52 కోట్లకు వేలం వేశారు. మహారాష్ట్రలో దావూద్ కు భారీగా బినామీ ఆస్తులున్నట్లు ప్రభుత్వాలు గుర్తించాయి. అయితే వాటిని స్వాధీనం చేసుకునే దిశగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఒకటొకటిగా అవరోధాలు తొలగించుకుంటూ వాటిని స్వాధీనం చేసుకుని వేలం వేస్తున్నాయి.

దావూద్ ఆరోగ్యంపై అనుమానాలు

ఇటీవలి కాలంలో దావూద్ ఆరోగ్యంపై అనేక అనేక కథనాలు ప్రచారమవుతున్నాయి. అతనికి విషప్రయోగం జరిగిందని దానితో ఆస్పత్రిలో చేర్చారని ప్రచారమైంది. అయితే అనారోగ్యంతో వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన మాట నిజమేనని ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించాయి. విష ప్రయోగం జరిగిన మాట మాత్రం వాస్తవం కాదని తేల్చాయి. మథమేహంతో ఇబ్బంది పడుతున్న దావూద్ తరచూ ఆస్పత్రి పాలవుతున్నట్లు మాత్రం తెలుస్తోంది. 2018 నుంచి అదే పరిస్థితి కొనసాగుతోందని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో దావూద్ చనిపోయినట్లు కూడా వదంతులు వ్యాపించాయి…