తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక వ్యూహం – లోక్ సభ ఎన్నికల కోసం కసరత్తు !

తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రత్యేకమైన కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ హైకమాండ్ ఈ సారి .. అన్ని రాష్ట్రాల్లోనూ తన ప్రభావం కనిపించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దేశవ్యాప్తంగా యాభై శాతం ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ, తెలంగాణలోనూ అదే వ్యూహం అమలు చేయబోతున్నారు. దీనిపై ఇప్పటికే బీజేపీ వార్ రూమ్ లో మాస్టర్ ప్లాన్ సిద్ధమయిందని కార్యాచరణ కూడా అమల్లోకి వచ్చిందని తెలుస్తోంది.

గెలుపు అవకాశం ఉన్న ఇప్పటికే రంగంలోకి నేతలు

తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో పరిస్థితుల్ని అవగాహన చేసుకుని.. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న చోట్ల నేతల్ని అలర్ట్ చేశారు ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలో కూడా సందేశాలు పంపుతున్నారు. పార్టీ చెప్పినట్లుగా చేస్తే గెలుపు ఖాయమని .. చెబుతున్నారు. నేతలు కూడా.. ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. కాస్త పరిశీలించి చూస్తే.. ఏపీలో తెలంగాణలో ప్రత్యేకమైన నియోజకవర్గాల్లో బీజేపీ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. భారీ హడావుడి లేకపోయినా చాపకింద నీరులా విస్తరించుకుంటూ పోతున్నారు.

దక్షిణాదిలోనూ ఈ సారి మోదీ ప్రభంజనం

దక్షిణాదిలోనూ ఈ సారి మోదీ ప్రభంజనం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో దక్షిణాదిన పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ ఈ సారి మాత్రం దక్షిణాదిన మోదీ హవా కనిపించనుంది. ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గిపోతూండటం .. దేశాన్ని ముందుకు నడిపించే నేత మోదీ ఒక్కరేనని.. ఇంకెవరూ లేరన్న అభిప్రాయం ప్రజల్లో బలపడటంతో.. ఈ విజయం సాధ్యమవుతోందని అంచనా వేస్తున్నారు. ఈ సారి ఎన్నికల తర్వాత ఎవరూ ఊహించని ఫలితాలు వస్తాయని ఇప్పటికే బీజేపీ నేతలు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పాతిక స్థానాలపై ప్రత్యేక దృష్టి

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పాతిక స్థానాలపై బీజేపీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. హిందూపురం లాంటి చోట్ల విష్ణువర్ధన్ రెడ్డి పూర్తి స్థాయిలో పని చేసుకుంటున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు తెలుగు రాష్ట్రాల్లో పాతిక వరకూ ఉన్నాయని.. ఇప్పటికే అభ్యర్థులు అయ్యే అవకాశం ఉన్న వారికి పని చేసుకోవాలని చెప్పారని అంటున్నారు. ముందు ముందు రాజకీయాల పరంగా కీలక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది.