యుద్ధ భూమిలో రథంపైనుంచి తూలి కిందకు పడబోతున్న రావణుడిని చూసి రాముడు..”భయంకరమైన యుద్ధం చేశావు రావణా, నీ ఖడ్గం విరిగిపోయింది, నీ గుర్రాలు చనిపోయాయి. నీ సారధి మరణించాడు, నీ ధ్వజం కిందపడిపోయింది, నీ రథం ముక్కలయ్యింది, నీ కిరీటం కింద పడిపోయింది, నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు. బాగా అలసిపొయావు, నీ కళ్ళల్లో భయం కనపడుతోంది..నీ ఒంటికి చెమట పట్టింది, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. ఇవాళ వెళ్లి విశ్రాంతి తీసుకో, మళ్ళీ రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కు, చేతిలో ఆయుధంతో రా..అప్పుడు యుద్ధం చేద్దాం అన్నాడు. తిరిగి అంతఃపురానికి వెళ్లిపోయిన రావణుడు మంత్రులను, సైన్యాన్ని పిలిచి సిగ్గుతో తలదించుకుని తనకున్న శాపాలన్నీ చెప్పకొచ్చాడు.
ఇవే రావణుడి శాపాలు
ఒకరోజు బ్రహ్మగారు నాతో నువ్వు మనుష్యుల చేతిలో నశించిపోతావు అన్నారు. ఆ మాట నిజమవుతోంది. ఆ బ్రహ్మ గురించి తపస్సు చేసినప్పుడు దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషుల చేతుల్లో మరణించకూడదని కోరుకున్నాను కాని మనుష్యుల చేతిలో, వానరుల చేతిలో మరణించకూడదన్న వరాన్ని నేను అడగలేదు.
ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు (రావణుడు అనరణ్యుడిని యుద్ధంలో సంహరించాడు) అని ఒక రాజు ఉండేవాడు. ఆయన నన్ను ఓ రోజు రాక్షసుడా మా ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడు నిన్ను సంహరిస్తాడని శపించాడు. అలా నన్ను సంహరించడానికే రాముడు ఇక్ష్వాకు వంశంలో రాముడిగా వచ్చి ఉంటాడు.
పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న వేదవతిని అనుభవించాలని ప్రయత్నించాను. ఆ వేదవతి “స్త్రీ కారణంగా నువ్వు నశించిపోతావు” అని శపించింది. బహుశా ఆ వేదవతే జనక మహారాజుకి కూతురిగా సీతగా పుట్టింది. ఆ సీతని నా మృత్యువు కోసమే తెచ్చిపెట్టుకున్నాను.
ఓ రోజు కైలాశ పర్వతం మీద పార్వతీదేవి నన్ను శపించింది, నందీశ్వరుడు శపించాడు (నందీశ్వరుడిని చూసి రావణుడు కోతి ముఖంవాడ అని హేళన చేశాడు. ఆ వానరాలే నీ కొంప ముంచుతాయిరా అని నంది అన్నాడు). ఇంకా నలకూభేరుడి భార్య అయిన రంభ శాపం ఫలిస్తోంది, వరుణుడి కుమార్తె అయిన పుంజకస్థల శాపం ఫలిస్తోంది. ఇవ్వన్నీ నిజం చెయ్యడం కోసమే రాముడొచ్చాడని అనుకుంటున్నాను. అని తనకున్న శాపాలన్నీ చెప్పాడు రావణుడు. అయినప్పటికీ తాను ఎవరికీ భయపడనని, సీతను ఇవ్వనని చెప్పి తెల్లారి యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్నాడు రావణుడు.
గమనిక: కొందరు పండితుల నుంచి, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.