టీడీపీ సీనియర్లకు సీట్ల గల్లంతు – జనసేనతో పొత్తుతో మొదటికే మోసం

టిడిపి, జనసేన పొత్తు నేపథ్యంలో టిడిపిలో అసెంబ్లీ టిక్కెట్లు ఆశిస్తున్న కొంతమంది నేతల్లో గుబులు నెలకొంది. టిడిపి, జనసేన అధినేత భేటీతో వారిలో ఆందోళన మరింత పెరిగింది. ఈ భేటీలో పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు కూడా చర్చకు వచ్చినట్లు టిడిపి నేతలు చెబుతున్నారు. వైసిపి అధినేత జగన్‌ ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికపై దూకుడుగా ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చడం, కొత్తవారిని తెరపైకి తీసుకురావడం వంటి నిర్ణయాలనుఅమలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తమ పార్టీల నుంచి కూడా అభ్యర్ధులను ఖరారు చేయాలని చంద్రబాబు, పవన్‌ నిర్ణయానికి వచ్చి న్నట్లు తెలిసింది.

జనసేనతో తేలని సీట్ల సర్దుబాటు వ్యవహారం

ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే రెండు వారాల ముందే పొత్తులు, సీట్లు ఖరారు చేయాలని అనుకున్నట్లు సమాచారం. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మాత్రం 120 స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తిచేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. మిగిలిన 55 సీట్లను పొత్తులో భాగంగా పెండింగ్‌లో ఉంచారు. ఇరు పార్టీల మధ్య అవగాహన వచ్చి అభ్యర్థులు ఖరారు చేసుకున్న తరువాత ఈ సీట్లను ప్రకటించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.
గుంటూరు జిల్లాలో తెనాలి, ఉమ్మడి కృష్ణాలో విజయవాడ పశ్చిమ, ప్రకాశంలో దర్శి, తూర్పు గోదావరిలోని రాజమండ్రి, రాజోలు, పశ్చిమగోదావరిలో భీమవరం, విశాఖపట్నంలో గాజువాక, చిత్తూరు లో తిరుపతి వంటి స్థానాలను గట్టిగా కోరే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఉభయగోదావరి జిల్లాల్లో జనసేనకు ఎక్కువ సీట్లు

జనసేన పార్టీ బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తెనాలి నుంచి జనసేన పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌కు పొత్తులో భాగంగా ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికే టిడిపి నేతలు ఒక అంచనాకు వచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి టిడిపి ఇంతవరకు ఇన్‌ఛార్జిని నియమించలేదు. ఈ సీటును జనసేన నుంచి పోతిన మహేష్‌కు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రాజమండ్రి సీటు కందుల దుర్గేష్‌ కు ఇవ్వొచ్చని తెలిసింది. జనసేనకు సీట్లు సర్దుబాటు చేసిన స్థానాల్లో ఉన్న టిడిపి అభ్యర్థులను లోక్‌సభకు పంపిస్తామని బుజ్జగిస్తున్నట్లుగా చెబుతున్నారు.

తేడా వస్తే పొత్తు ఫలితం ఉండదు !

రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ టు ఎప్పుడూ ఉండదు. ఒక సారి ఇరవై కావొచ్చు.. ఇంకో సారి జీరో కావొచ్చు. ఇలా అవ్వాలంటే.. కలసి రావాల్సింది రాజకీయం. తేడా వస్తే జీరో అవుతుంది. ఇప్పుడు టీడీపీ, జనసేన పరిస్థితి అలాగే ఉంది. జాగ్రత్తగా పొత్తుల్ని డీల్ చేసుకోవాలని.. అటు నేతల్ని ఇటు కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం అంటున్నారు.