మిల్లెట్స్ ఎవరు తినొచ్చు – ఎవరు తినకూడదు!

లైఫ్.. సైకిల్ చక్రంలా ఎక్కడ మొదలైందో అక్కడికే వస్తోంది. అప్పట్లో తిన్న ఆహారమే ఆరోగ్యానికి మంచిదంటూ మళ్లీ ఇప్పుడదే ఫాలో అవుతున్నారు. పైగా కొత్త కొత్త రోగాలు, వేరియంట్లు పుట్టుకురావడంతో ఆరోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం యూత్ ఫాలో అవుతున్న అలవాట్లలో మిల్లెట్స్ ఒకటి. అయితే మిల్లెట్స్ ఎవరు తినొచ్చు? ఎవరు తినకూడదు? మిల్లెట్స్ తింటే ఉపయోగం ఏంటి? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?…

పోషకాలు అధికం
ప్రతి మనిషికి రోజుకి 38 గ్రాముల ఫైబర్ కావాలి. తృణ ధాన్యాలు లేదా మిల్లెట్స్ ఎక్కువ ఫైబర్ కలిగి ఉండే ఫుడ్స్. అందుకే మిల్లెట్స్ తింటే రోజుకు సరిపడా ఫైబర్ లభిస్తుంది. వీటిలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, జింక్, మెగ్నీషియం, సెలీనియం, సోడియం లాంటి ఖనిజాలతో పాటు 12 శాతం ప్రోటీన్‌ కూడా ఉంటుంది. ఒక కప్పు సిరి ధాన్యాల నుంచి రోజుకు అవసరమైన మాంగనీస్ 33%, ట్రిప్టోఫాన్ 32%, మెగ్నీషియం 27%, ఫాస్పరస్ 24% లభిస్తాయి. వరి, గోధుమల కన్నా ఎన్నో రెట్లు అధికమైన పోషక విలువలు వీటిలో ఉంటాయి.

అరగడం కష్టం కానీ..
మిల్లెట్స్ తీసుకుంటే ఒక్కసారిగా కాకుండా కొద్దికొద్దిగా తక్కువ మోతాదులో బాడీలోకి గ్లూకోజ్‌ని రిలీజ్ చేస్తుంది. కొన్ని రకాల చర్మ సమస్యలకు, కిడ్నీ సమస్యలకు, బీపీ, క్యాన్సర్, ఆస్తమా నివారించడంలోనూ మిల్లెట్స్ దోహదపడతాయి. ఇవి పడకపోవడం ఉండదు కానీ రెగ్యులర్ గా తినే అన్నం నుంచి వీటికి మారడం వల్ల అరగడం కొంత కష్టం అవుతుంది. అలవాటు పడ్డాక రైస్ కంటే ఇవే బెటర్ గా అనిపిస్తాయి. డయేరియా పేషేంట్స్ మాత్రం తమ కండీషన్ చూసుకుని తీసుకోవాలి. ఇప్పటికే స్కిన్ అలర్జీ ఉన్నవారికి కూడా ఇవి పడకపోవచ్చు. పేగుల్లో సమస్యలు ఉన్నవారికి ఆహారాన్నిజీర్ణం చేసుకునే శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటివాళ్లు డాక్టర్ల సలహా మేరకు వీటిని తీసుకోవాలి. వీటితో అన్నం వండుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోశె ఇలాంటివి కూడా చేసుకోవచ్చు.

చిన్న పిల్లలకు వద్దు
చిన్న పిల్లలకి మిల్లెట్స్ పెట్టకపోవటమే మంచిది. చిన్నారులకు అరుగుదల తక్కువగా ఉంటుంది. అందుకే వారికి తేలికగా జీర్ణమయ్యే ఆహారం పెట్టాలి కానీ మిల్లెట్స్ ఫుడ్ పెట్టకూడదు. మిల్లెట్స్‌లో ఉండే కంటెంట్స్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్లకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఇలాంటి వాళ్లు రోజుకి 35 గ్రాములకు మించి మిల్లెట్స్‌ని తీసుకోకూడదు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.