మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు.జైలు నుంచి విడుదలై కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత మరో సారి రాజకీయాల్లో క్రియాశీలమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.సొంత అజెండాతో నేతలపై విరుచుకుపడుతున్నారు. మీటింగులు పెడుతున్నారు. దీనితో కాంగ్రెస్ పార్టీలోనూ, బయట ఆయన ప్రత్యర్థులు కూడా మాటల తూటాలు పేల్చేందుకు వెనుకాడటం లేదు..
మద్దతుదారుల మీటింగు పెట్టిన సిద్ధూ
సిద్ధు ఇటీవల ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆయన మద్దతుదారులు హాజరయ్యారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఒకటై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు కేప్టెన్ అమరీందర్ సింగ్, చరణ్ జిత్ సింగ్ చైనీపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. పంజాబ్ ప్రయోజనాలను కాపాడటంలో వారిద్దరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
సిద్ధూకు బాజ్వా గట్టి సమాధానం..
సిద్ధూ వ్యాఖ్యలకు ప్రస్తుత పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ (పీసీసీ) అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ బాజ్వా గట్టి సమాధానమిచ్చారు. సిద్ధూ అతి తెలివి తేటల వల్లే పంజాబ్లో కాంగ్రెస్ 78 స్థానాల నుంచి 18 స్థానాలకు పడిపోయిందన్నారు. సలహాలు, సంప్రదింపులు ఏమైనా ఉంటే పార్టీలో అంతర్గతంగా చెప్పాలన్నారు. స్వయంగా ర్యాలీలు నిర్వహించడం ఆపి.. త్వరలో పార్టీ తరపున జరిగే ర్యాలీలో పాల్గొనాలని సిద్ధూను ఆయన కోరారు. నిజానికి పంజాబ్ లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని కలుపుకుపోవడం బాజ్వా వర్గానికి ఇష్టం లేదు. ఆప్ తప్పులను ప్రస్తావిస్తూ ముందుకు వెళితే పార్టీ గెలుస్తుందన్న విశ్వాసం వారికి ఉంది. అయితే సిద్ధూ తీరు మాత్రం ఆప్ కు కొమ్ముకాసే విధంగా ఉందని వారి వాదన.అదే సమయంలో పార్టీలోని కొందరు నేతలు కూడా సిద్ధూను తప్పుపట్టారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుల్బీర్ సింగి జీరా, ఇందర్ బీర్ సింగ్ బొలారియా లాంటి వాళ్లు ప్రకటనలు విడుదల చేశారు.
సిద్ధూ అనుచరుల ఎదురుదాడి
సిద్ధూ అనుచురులు ఇప్పుడు ప్రతాప్ సింగ్ బాజ్వాపై ఎదురుదాడి చేస్తున్నారు. విడివిడిగా లేఖాస్త్రాలు సంధిస్తూ పీసీసీ అధ్యక్షుడిపై విరుచుకుపడేందుకు ప్రయత్నిస్తున్నారు. సిద్ధూను, తమను కాంగ్రెస్ కార్యక్రమాలకు పిలవడం లేదని వారు గుర్తు చేశారు. తమ ర్యాలీకి వేల మంది వేస్తే బాజ్వా కుళ్లుకుంటున్నారని వారు ఆరోపించారు. పార్టీ ప్రయోజనాలకు పనిచేస్తున్న తమను అడ్డుకోవడం మంచిది కాదన్నారు. నిజంగా బాజ్వా వర్గానికి ఆప్ పట్ల వ్యతిరేకత ఉంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దానితో ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ రెండు గ్రూపుల మధ్య కొట్లాట వీధిన పడినట్లయ్యింది.