ఇండియా గ్రూప్ విచ్ఛిన్నం ఖాయమా ?

మోదీని గద్దె దింపి తాము అధికారంలోకి రావాలన్న ఏకైక ధ్యేయంతో ఏర్పాటైన ఇండియా గ్రూపుకు ఆది నుంచి హంసపాదే అవుతోంది. ప్రతీ ఒక్కరూ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఎవరికి ఎక్కువ పట్టు ఉందో అర్థం కావడం లేదు. తాజాగా ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలోనూ వారిలో తగవులు బయటపడుతున్నాయి.నేతలు అలిగి మీటింగుల నుంచి వెళ్లిపోయే దుస్థితిలో ఇండియా గ్రూపు ఉందంటే అది అతిశయోక్తి కాదు…

మీటింగు నుంచి వెళ్లిపోయిన నితీశ్, లాలూ

ఢిల్లీలో జరిగిన ఇండియా గ్రూపు సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించారు.దానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతిచ్చారు. లోక్ సభ ఎన్నికల ముందు జరిగిన ఇండియా గ్రూపు నాలుగో మీటింగులో ప్రచారమూ, సీట్ల సర్దుబాట్ల విషయం చర్చకు రావాల్సి ఉండగా మమత ప్రతిపాదనతో మొత్తం వ్యవహారం పక్కతోవ పట్టినట్లయ్యింది. మమత ప్రతిపాదనతో ప్రధాని పదవిని ఆశిస్తున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్ర ఆగ్రహం చెందారు. లాలూ కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. తన అభ్యర్థిత్వం తెరపైకి రాకుండా ఉండేందుకే మమతా బెనర్జీ పాచిక వేశారని నితీశ్ అనుమానించారు. దానితో ప్రెస్ మీట్లో పాల్గొనకుండానే నితీశ్, లాలూ వెళ్లిపోయారు.

తానే ప్రధాని అభ్యర్థి కావాలనుకుంటున్న నితీశ్

బిహార్ సీఎంకు చాలా కాలంగా ప్రధాన మంత్రి పదవిపై ఆశలున్నాయి. ఆయనే ఎక్కువ చొరవ చూపి ఇండియా గ్రూపు ఏర్పాటుకు ప్రయత్నించారు. ఎక్కువకాలం సమర్థవంతుడైన ముఖ్యమంత్రిగా చేసిన అనుభవాన్ని దేశానికి వినియోగించాలని నితీశ్ అనుకుంటున్నారు. పైగా ప్రధాని మోదీకి గట్టిపోటీ నితీశ్ కుమార్ మాత్రమేనని జేడీయూ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే నితీశ్ వల్లే సాధ్యమని జేడీయూ చెప్పుకుంటోంది. నిధులు కూడా జేడీయూ సమకూరుస్తుందని, కాంగ్రెస్ పార్టీ దగ్గర టీ, బిస్కెట్స్ కి మాత్రమే డబ్బులు ఉన్నాయని జేడీయూ ఎగతాళి చేస్తోంది. ఢిల్లీ మీటింగులో సమోసాలు కూడా పెట్టలేదని , టీ-బిస్కెట్లతో సరిపెట్టారని ఒక జేడీయూ నేత కామెడీ చేశారు.

అవసరమైతే వైదొలిగేందుకు సిద్ధం

నితీశ్ కుమార్ ఆగ్రహం ఎంతగా పెరిగిపోయిందంటే ఇండియా కూటమి నుంచి వైదొలిగేందుకు సైతం ఆయన సిద్ధంగా ఉన్నారని అనుచరులు చెబుతున్నారు. దళిత నాయకుడు అనే ముద్రతో ఖర్గే పేరును తెరపైకి తీసుకురావడం ఆయనకు ఏ మాత్రం నచ్చలేదు, ఇంతకాలం రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేసిన తమను గుర్తించరా అన్నది నితీశ్ ప్రశ్న. మరో పక్క లాలూ డబుల్ గేమ్ ఆడారని కూడా చెప్పుకుంటున్నారు. ఖర్గే పేరును ప్రతిపాదించాలని మమతకు సలహా ఇచ్చిందే ఆయనట. ఆ క్రమంలో నితీశ్ ను దెబ్బకొట్టొచ్చని అంచనా వేశారట. మొత్తానికి పొగ పెట్టి ఏమీ తెలియనట్లుగా ఆయన నితీశ్ కు మద్దతిస్తున్నట్లుగా నాటకం ఆడేశారన్నమాట.