తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాలు కైవసం చేసుకొని రాష్ట్రంలో మూడో పార్టీగా అవతరించింది. చాలా స్థానాల్లో పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. ఇదే ఊపుతో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో సికింద్రాబాద్ బీజేపీ ఖాతాలోనే ఉండగా, ఈసారి మల్కాజిగిరి నుంచి జెండా ఎగురేయాలని ప్లాన్ చేసుకుంటున్నరాు.
మల్కాజిగిరిలో బలపడిన బీజేపీ
మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో బీజేపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది. దీని పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, కంటోన్మెంట్, కూకట్పల్లి ఉన్నాయి. కూకట్పల్లి మినహా మిగతా ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసిన బీజేపీ మంచి ఓట్లు రాబట్టింది. ఉప్పల్‌లో 55,427, మేడ్చల్‌లో 50,535, మల్కాజిగిరిలో 47,332, కంటోన్మెంట్లో 41,888, ఎల్బీనగర్లో 89,075, కుత్బుల్లాపూర్‌లో 1,02,423 ఓట్లు బీజేపీ అభ్యర్థులకు వచ్చాయి. ఈ ఆరు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం ఓట్లు 3,86,680. గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే 82,398 ఓట్లు అదనం. ఇందులో బీజేపీ పొత్తుతో జనసేన పోటీ చేసిన కూకట్పల్లి కాకుండానే మంచి ఆధిక్యతను కనబర్చిచిందని నాయకులు భావిస్తున్నారు. కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థికి 39,830 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈసారి మల్కాజిగిరిలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించితే సులువుగా గెలుస్తామనే ధీమాతో పార్టీ ఉంది.
బలమైన అభ్యర్థిని నిలబెడితే గట్టి చాన్స్
మల్కాజిగిరి లోక్‌సభ టికెట్ కోసం బీజేపీ నాయకుడు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ దృష్టి పెట్టారు. ఇటీవల ఆయన అగ్రనేతలను కలిసి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. గతంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా, పార్లమెంట్ ఇన్చార్జిగా వ్యవహరించానని, బీసీ ఓట్లు గణనీయంగా ఉండడంతో టికెటిస్తే ఈజీగా గెలుస్తానని వారితో అన్నట్లు సమాచారం. ఇప్పటికే తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. శ్రీశైలం గౌడ్ ఇటీవల కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 1,02,423 ఓట్లు వచ్చాయి.
రేసులో మురళీధర్ రావు, కూడా !
గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు 3,04,282 ఓట్లు వచ్చాయి. బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు కూడా మల్కాజిగిరి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. జాతీయ స్థాయి నేతకు టిక్కెట్ ఇస్తే గెలుపు సులువేనని భావిస్తున్నారు.