ఏపీలో కాంగ్రెస్‌ను లేపాలని చూస్తోందెవరు ? కీలక విషయాలు బయట పెట్టిన బీజేపీ నేత విష్ణు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ గురించి కొంత మంది మాట్లాడుతున్నారు. ఆ పార్టీలోకి షర్మిల వస్తుందని.. రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తారని.. మరోసారి ఆ పార్టీకి హైప్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ లో కాంగ్రెస్ పార్టీని లేపడానికిఒక పార్టీ దాని మద్దతుదారులు చూస్తున్నారని అది వారికి ఆత్మహత్యా సదృశమేనని హెచ్చరించారు. విష్ణువర్ధన్ రెడ్డి చెప్పిన ఆ పార్టీ ఏది ?

కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న ఏపీ ప్రతిపక్ష పార్టీ

తెలంగాణ ఎన్నికల్లో ఓ పార్టీ చేసిన ఓవరాక్షన్ ఏపీలో ఆశ్చర్యకరంగా మారింది. ప్రజలు కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకంత హడావుడి చేస్తున్నారన్న అభిప్రాయాన్ని వినిపిస్తూ వస్తున్నారు. కానీ ఆ పార్టీ , ఆ పార్టీ సోషల్ మీడియా కాంగ్రెస్ కోసం పని చేసింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీని ఓడించాలన్న టార్గెట్ గా పని చేసింది. ఆ ప్రయత్నాలు ఎంత మేర ఉపయోగపడ్డాయన్న సంగతిని పక్కన పెడితే.. అసలు ఆ పార్టీకి అంత అవసరం ఏమిటన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అదే పార్టీ ఏపీలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ లేపేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చంటున్నారు.

ఏపీలో కాంగ్రెస్ గాన్ కేస్ – ఎలా పైకి లేపుతారు ?

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదు. ఒక్క రంటే ఒక్క నేత కూడా ఎవరూ కనిపించరు. ఆ పార్టీ ఏపీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఎవరో ఎవరికీ తెలియదు. అయినా సరే ఆయన మాటలకు ప్రాధాన్యం ఇస్తూ కొన్ని మీడియాలు హైప్ క్రియేట్ చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కాంగ్రెస్ లో చేరుతారని… ఏపీలో బాధ్యతలుతీసుకుంటారని.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎదురుండదన్నట్లుగా చెబుతున్నారు. కానీ ఏపీ ప్రజల మనసుల్లో కాంగ్రెస్ ఎప్పుడో అంతర్థానం అయిపోయింది. ఈ విషయం తెలిసి కూడా ఎందుకిలా చేస్తున్నారన్నది చాలా మందికి తెలిసిన విషయమే.

ప్రోత్సహించే పార్టీకే గడ్డు పరిస్థితి !

రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని లేపాలని ప్రయత్నించే వారికీ.. అలాంటి పార్టీలకు గడ్డు పరిస్థితులే ఎదురవుతాయన్నది విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరిక. దీన్ని సాదాసీదాగా తీసుకోవాల్సిన అవసరం లేదని.. గతంలో జరిగిన పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షర్మిలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. విలీనం గురించి ఏమీ చెప్పలేదు. ఇప్పుడు ఆమెను ఏపీలోకి పంపి ఏదో చేయాలనుకుంటున్నట్లుగా లీకులు ఇస్తున్నారు.