పెళ్లంటే బాజాలు, భజంత్రీలు. పెళ్లంటే చుట్టాలు, స్నేహితులు. పెళ్లంటే విందులు, వినోదాలు. పెళ్లంటే ఆనందాల హరివిల్లు. నిండు నూరేళ్ల జీవితానికి సార్థకత ఇచ్చే పెళ్లి ఇప్పుడు వినోదమే కాదు, భారీ వ్యయమై కూర్చుంటోంది. సీజన్లో లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని లెక్కలు చెప్పే వాళ్లు.. ప్రతీ కుటుంబానికి ఎంత ఖర్చవుతుందో కూడా లెక్కలు వేస్తే బావుంటుందన్న చర్చ మొదలైంది. పైగా ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో విదేశాలకు వెళ్లి ఖర్చు చేసేందుకు పెళ్లి వారు వెనుకాడటం లేదు.
కనీస వ్యయం రూ. 35 లక్షల
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబరు 23న జరగాల్సి ఉంది. ఆ రోజు ఎక్కువ పెళ్లిళ్లు ఉండటంతో జనం ఓటు వేసేందుకు రారని నిర్ణయించుకున్న ఎన్నికల సంఘం దాన్ని నవంబరు 25కు వాయిదా వేసింది. ఇదీ దేశంలో ఇప్పుడు పెళ్లిళ్లకు జనం తండోపతండాలుగా ఎగబడుతున్న తీరుకు నిదర్శనం. నిరుపేదల సంగతి వదిలేస్తే.. మధ్య తరగతి వారు పెళ్లిళ్లకు రూ. 35 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. సంపన్నులు, డెస్టినేషన్ వెడ్డింగుకు వెళ్లే వారికి ఐదు కోట్ల వరకు ఖర్చయినా ఆశ్చర్యం లేదని చెప్పక తప్పదు. అందుకే 2023లో నవంబరు, డిసెంబరు పెళ్లిళ్ల సీజన్ ఖర్చు రూ.4.74 లక్షల కోట్లు అయ్యిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ నిగ్గు తేల్చింది. అనేక దేశాల స్థూల జాతీయోత్పత్తితో పోల్చితే ఇది చాలా ఎక్కువ. 2024 వెడ్డింగ్ సీజన్లో ఆ వ్యయం కనీసం 25 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు…
యాభై శాతం పైగా ఖర్చు వీడియోలు, డెకరేషన్, కేటరింగుకే…
పూర్వ కాలంలో పెళ్లి అంటే బంధువులు వారం ముందే వచ్చేవారు. కాకపోతే అందరూ ఉన్న ఇంట్లోనే సర్దుకుని వండుకు తినడంతో పెద్దగా ఖర్చులు కనిపించేవి కాదు. ఇప్పుడు సంగీత్, మేహందీ అంటూ పెడుతున్న ఖర్చు తడిసి మోపెడవుతోంది. పెళ్లి ఖర్చులో సగభాగం ఫోటోలు,వీడియోలు,స్టేజ్ డెకరేషన్, పెళ్లి మండపం, కేటరింగ్, డీజే, వాహనాల అద్దెలకే పోతోంది.మిగతా యాభై శాతంలో ఎక్కువ భాగం బట్టలు, నగలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఐదు శాతం వరకు రిటర్న్ గిఫ్ట్స్ కు పోతున్నాయని లెక్క తేల్చారు. సగం మందికి షుగర్ ఉన్నా స్వీట్స్ ఖర్చు మాత్రం తగ్గడం లేదు..
డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో భారీ వ్యయం
డెస్టినేషన్ వెడ్డింగ్ కొంతకాలంగా వినిపిస్తున్న మాట. అంటే ఉన్న ఊళ్లో పెళ్లి చేసుకోకుండా వేరే చోట వివాహ మహోత్సవం పెట్టుకోవడమే డెస్టినేషన్ వెడ్డింగ్. మన దేశంలో డెస్టినేషన్ వెడ్డింగుకు వెళ్లే వాళ్లు చాలా తక్కువ మంది. సంపన్నులంతా విదేశాల్లో పెళ్లి వేడుకలు చేసుకుంటున్నారు. కోటి నుంచి కోటి 20 లక్షల ఖర్చు పెట్టుకోగలిగితే ధాయ్ లాండ్ వెళ్లి పెళ్లి చేసుకోవచ్చు. అది చాలా చీప్ అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు ఇటలీ లేదా యూరప్ లోని వేరు దేశానికి వెళ్లి పెళ్లి చేసుకు వస్తున్నారు. ఇటలీలో విలాసవంతంగా పెళ్లి చేసుకోవాలంటే రూ. 5 కోట్ల వరకు ఖర్చవుతుంది. అది ఇండియా నుంచి 200 మంది వరకు అతిథులకు తీసుకువెళితేనే ఖర్చు అంతకు పరిమితమవుతుంది. ఇంకా ఎక్కువ మందిని తీసుకెళితే ఆ ఖర్చు వేరుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థాయ్ లాండ్ హోటళ్లు వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించేందుకు కూడా అనుమతించడం జనం అటుగా వెళ్తున్నారని వెడ్డింగ్ ప్లానర్స్ అంటున్నారు…
వెడ్ ఇన్ ఇండియా అంటున్న ప్రధాని మోదీ..
డెస్టినేషన్ వెడ్డింగ్ తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. భారతీయుల సొమ్ము విదేశాలకు తరలి వెళ్తోందని, అదే పెళ్లి ఇండియాలో జరిగితే చాలా మందికి ఉపాధి లభించడంతో పాటు మనదేశానికే పన్నులు చెల్లించినట్లవుతుందని ఆయన అన్నారు. అందుకే మేడిన్ ఇండియా తరహాలో వెడ్ ఇన్ ఇండియా ప్రచారం ఊపందుకోవాలని ఆయన అంటున్నారు. ఇండియాలో కూడా డెస్టినేషన్ వెడ్డింగుకు అవకాశాలున్నాయి. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటే,మనం మాత్రం ఎందుకు బయటకు వెళ్లాలన్నది ఒక ప్రశ్న. గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ దీవుల్లోని అందమైన ప్రదేశాలు, హోటళ్లు డెస్టినేషన్ వెడ్డింగుకు వీలుగా ఉంటాయని చెబుతున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది.పూర్వం పెళ్లి ఖర్చులు తల్లిదండ్రులే పెట్టుకునే వారు. ఇప్పుడు వధూవరులు కూడా తమ వాటా అందించేందుకు సిద్ధమవుతున్నారు. దానితో వారి కోర్కేలు పెరుగుతున్నాయని ఆరోపణలున్నాయి…