ఆదివారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హఠాత్తుగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. దాదాపుగా గంటన్నర సేపు చర్చలు జరిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడలేదు కానీ.. పవన్ కల్యాణ్.. ఇరవయ్యో తేదీన జడరగనున్న నారా లోకేష్ ముగింపు యాత్రకు వెళ్తారన్న ప్రకటన మాత్రం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. జనసైనికులు కూడా పాల్గొంటారని చెప్పుకొచ్చారు. మరి ఈ చర్చల్లో ఏం జరిగింది ?
సీట్లపై తేల్చకపోవడంతో అలిగిన జనసేనాని ?
తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని తాను లోకేష్ ముగింపు యాత్రకు వచ్చేది లేదని పవన్ ఇంతకు ముందు ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న విషయం బయట ప్రపంచానికి తెలిసిపోయింది. అసలు ఏమయింది అంటే.. పవన్ కల్యాణ్‌కు .. జనసేనకు ఇచ్చే సీట్ల విషయంలో చంద్రబాబునాయుడు నాన్చుడు ధోరణితో ఉండటంతోనే అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు. అందుకే.. టీడీపీ పిలుపునిస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణియంచుకున్నారని అంటున్నారు.
పవన్ అడిగినన్ని సీట్లిచ్చేందుకు చంద్రబాబు రెడీనా ?
పవన్ కలసి రాకపోతే ఎన్నికల్లో గెలవడం కష్టమనుకుంటున్న చంద్రబాబు.. పవన్ అసంతృప్తిని గుర్తించి వెంటనే.. ఆయన ఇంటికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ నాదెండ్ల మనోహర్ కూడా ఉండటంతో సీట్లపై చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తాను అనుకున్నట్లుగా సీట్లపై హామీ పొందారని.. అందుకే లోకేష్ సభ కు హాజదరయ్యేందుకు అంగీకారం తెలిపారని అంటున్నారు. భేటీ తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడలేదు. నాదెండ్ల మనోహర్ మాట్లాడారు కానీ.. ఎప్పుడూ చెప్పేదే చెప్పారు.
పొత్తు సజావుగా సాగుతుందా ?
పొత్తుల విషయంలో చంద్రబాబు వ్యవహారశైలి రాజకీయవర్గాలకు చిరపరిచితమే. ఆయన సీట్లు కేటాయించినా తమ పార్టీ నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వాలి లేకపోతే.. ఇండిపెండెంట్ గా నిలబెడతారు..సపోర్ట్ చేస్తారు. ఇలాంటివి గతంలో జరిగాయి. ఇప్పుడు జనసేన విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. మొత్తంగా జనసేన, టీడీపీ మధ్య గ్యాప్ పెరుగుతోందని మాత్రం స్పష్టం అవుతోంది.