కాశీ క్షేత్రానికి వెళ్లాలనే ఆలోచనే సమస్త పాపాలను నశింపజేస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రంలో అణువణువూ విశేషమైనదే. వాటిలో ఒకటి విమలాదిత్య ఆలయం…
విశ్వనాథుడు .. విశాలాక్షి అమ్మవారు కొలువైన కాశీ క్షేత్రాన్ని దర్శించడం వలన మళ్లీ జన్మనేది ఉండదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువల్లనే కాశీ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించాలనే కోరిక ప్రతి హిందువు మనసులో బలంగా ఉంటుంది. పురాణపరమైన అనేక ఘట్టాలకు .. విశేషాలకు నెలవుగా కాశీ క్షేత్రం కనిపిస్తుంది. పాపాలను పటాపంచలు చేసే ఈ క్షేత్రంలో సూర్యభగవానుడు కొలువైన 12 ఆలయాలు కనిపిస్తాయి. ఒక్కో ఆలయంలో సూర్యభగవానుడు ఒక్కో పేరుతో పిలుస్తారు. వారే ద్వాదశ ఆదిత్యులు. ఈ ద్వాదశ ఆదిత్యులలో ఒకటి ‘విమలాదిత్యుడు’ కొలువైన ఆలయం.
విమలాదిత్య ఆలయం పురాణ గాథ
పూర్వం ‘విమలుడు’ అనే రాజు కుష్ఠువ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. దాంతో జీవితం పట్ల విరక్తితో ఆయన భార్యా బిడ్డలను వదిలి కాశీ క్షేత్రానికి చేరుకుంటాడు. ఆదిత్యుని రూపాన్ని ప్రతిష్ఠించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన సూర్యభవానుడు ప్రత్యక్షమై, కుష్టువ్యాధి నుంచి విముక్తుడిని చేస్తాడు. విమలుడు ప్రతిష్ఠించిన మూర్తి కావడంతో విమలాదిత్యుడు పేరుతో పూజలందుకుంటుందని అంటాడు. విమలాదిత్యుడిని పూజించినవారికి వ్యాధులు, బాధలు, దారిద్ర్య దుఃఖాలు ఉండవని విశ్వాసం. అందుకే కాశీ క్షేత్రానికి చేరుకున్నవారు , ఇక్కడి సూర్య దేవాలయాలను తప్పకుండా దర్శించుకుంటారు.
ఏడాదిలో ఒక్కో రాశి మారుతూ మొత్తం 12 తెలుగు నెలల్లో ఒక్కో నెలకు ఒక్కో ప్రాధాన్యత వహిస్తాడు సూర్యుడు. తెలుగు నెలల ప్రకారం ఆయా సమయంలో సూర్యుడి తీక్షణతని బట్టి ఈ పేర్లు వచ్చాయని చెబుతారు. హిందూ పురాణాలలో “అదితి”, కశ్యపుని 12 మంది పుత్రులను ద్వాదశాదిత్యులు అంటారు. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో వర్ణించారు. మహాభాగవతం 12వ స్కంధం చివరిలో ద్వాదశాదిత్యుల వర్ణ ఉంది. ఒక్కొక్క నెలలో సూర్య భగవానుడు ఆయా నామంతో పూజలందుకుంటాడు.
గమనిక: కొందరు పండితుల నుంచి, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.