ఉద్ధవ్ ఠాక్రేకు దావూద్ ఇబ్రహీంతో లింకులున్నాయా…?

దేశ రాజకీయాల్లో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పాకిస్థాన్ లో తరదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కస్కర్ మధ్య ఏదో లింకు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దీనికి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.

1993 పేలుళ్ల దోషితో ఫోటో..

బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణా మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రదర్శించిన ఒక ఫోటో ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన నాశిక్ ఎమ్మెల్యే సుధాకర్ బడ్గూజార్ ఆ ఫోటోలో ఉన్నారు. ఆయనతో పాటు 1993 ముంబై పేలుళ్లలో జీవిత ఖైదు పడిన సలీం కుట్టా కూడా ఫోటోలో కనిపిస్తున్నాడు. సలీం కుట్టా …దావూద్ గ్యాంగ్ కోసం పనిచేసేవాడన్న ఆరోపణలున్నాయి. పెరోల్ పై బయటకు వచ్చిన సలీం కుట్టాకు సుధాకర్ బడ్గూజార్ పార్టీ ఇచ్చాడని అప్పుడే ఆ ఫోటో తీశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, శివసేనకు – దావూద్ ఇబ్రహీంకు ఉన్న లింకులపై విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు..

సిట్ వేయాలని ఫడ్నవీస్ ఆదేశం…

ఫోటో వ్యవహారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. నిర్దేశిత కాలావధిలో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. ఇదీ చాలా సీరియస్ విషయమని, పార్టీ జరిగిందా లేదా.. పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు..లాంటి అంశాలను అణ్వేషించాల్సి ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తం వ్యవహారంలో ఉద్ధవ్ ఠాక్రే అసలు రంగు బయటపడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు..శివసేన, దావూద్ మధ్య ఎలాంటి లింకులున్నాయి..ఈ వ్యవహారాలు ఎన్నాళ్లుగా కొనసాగుతున్నాయనేది కూడా తేల్చాల్సి ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. మహారాష్ట్రలో దావూద్ పెత్తనం ఇంకా కొనసాగుతోందనేందుకు ఇలాంటి ఘటనలే నిదర్శనమని అనుమానిస్తున్నారు..

ఫోటో మార్ఫింగ్ చేశారంటున్న శివసేన

ఫోటో వ్యవహారంపై విచారణ మొదలుకాక ముందే శివసేన ఎదురుదాడికి దిగింది. ఎవరో కావాలనే ఫోటో మార్ఫింగ్ చేసి తమను ఇరకాటంలో పెడుతున్నారని శివసేన నేతలు అంటున్నారు.నేటి సమాజంలో డీప్ ఫేక్ సర్వసాధారణమైపోయిందని తమ ఎమ్మెల్యే విషయంలోనూ అదే జరిగిందని శివసేన ఆరోపిస్తుంది. సుధాకర్ బడ్గూజార్ మంచి నాయకుడని నాశిక్ ప్రాంతంలో ఆయనకు మంచి పేరు ఉందని చెప్పుకొచ్చింది. ప్రజల కోసం పనిచేసే నాయకుడిపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం తగదన్నారు.