వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా ఉన్న మోపిదేవి వెంకట రమణా రావుకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. ఆయన ఇంచార్జ్ గా ఉన్న రేపల్లెకు ఈపూరి గణేష్ అనే కొత్త నేతకు బాధ్యతలు ఇచ్చారు సీఎం జగన్. సీఎం జగన్ కు ఎంతో సన్నిహితుడు అయిన మోపిదేవి విషయంలో జగన్ అంత కఠినంగా ఎందుకు వ్యవహరించారు.. రేపల్లెలో అసలేం జరుగుతోందన్నదానిపై వైసీపీలో విస్తృత చర్చ జరుగుతోంది.
కుమారుడికి టిక్కెట్ ఇప్పించాలనుకున్న మోపిదేవి
మోపిదేవి ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన పదవి కాలం ఇంకా మూడేళ్లకుపైగా ఉంది. అందుకే ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడిని పోటీ చేయించాలని బావించారు. గడపగడపకు కార్యక్రమంలో మోపిదేవి కుమారుడు మోపిదేవి రాజీవ్ జోరుగా పాల్గొంటున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఇక్కడ సీటు కన్ఫర్మ్ అనుకునేంత స్థాయిలో రాజకీయాలు జోరందుకున్నాయి. కానీ, అనూహ్యంగా రేపల్లె ఇన్‌చార్జిగా డాక్టర్ ఈవూరు గణేష్‌ను వైసీపీ అధిష్టానం నియమించింది.
ఓడిపోయినా మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్
గత ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి మోపిదేవి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి.. తర్వాత మంత్రిని చేశారు. అనంతరం.. రాజ్యసభకు పంపించారు. ఇలా.. జగన్ కు ఎంతో దగ్గర అయిన నేపథ్యంలో తన మాటకు తిరుగులేదని భావించిన మోపిదేవి.. రేపల్లె నియోజకవర్గం నుంచి తన కుమారుడిని రంగంలోకి దింపేందుకు చర్యలు ప్రారంభించారు. కానీ మాజీ మంత్రి ఈపూరి సీతారావమ్మ కుమారుడు అయిన ఈపూరి గణేష్‌కు సీఎం జగన్ చాన్సిచ్చారు.
మోపిదేవి అలుగుతారా ?
ఈ పరిణామం మోపిదేవికి ఇబ్బందికరంగానే మారింది. గణేష్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న ఎంపీ మోపిదేవి వర్గం రేపల్లెలో ఆందోళనకు దిగింది. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన తెలిపింది. మోపిదేవికి మద్దతుగా పలువురు వైసీపీ కౌన్సిలర్ల రాజీనామాకు సిద్ధమయ్యారు. రేపల్లెకు కొత్త ఇన్‌చార్జ్ నియామకంపై అధిష్టానం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే.. అధిష్టానం మాత్రం.. ఎలాంటి డిమాండ్లకు తలొగ్గే పరిస్థితి లేదని తెలుస్తోంది. తాము చెప్పినట్టు వినాల్సిందేనని.. తేల్చి చెబుతోంది. మోపిదేవి ప్రాధాన్యతను తగ్గించాలని కాదని.. పూర్తిగా సామాజిక సమీకరణాలతో తీసుకున్న నిర్ణయమేనంటున్నారు.