శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి హాట్ సీటు. ఈ సీటు లో ఉన్నది పదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఏలుతున్నది ఎవరో కాదు, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయనను ఈసారి ఎలాగైనా ఓడించాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. టెక్కలిలో 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది అభ్యర్ధులు ఉన్నారు. కానీ వారిలో వారికి సరిపడకపోవడంతో ఎవర్నీ డిసైడ్ చేయలేకపోతున్నారు.
దువ్వాడ దంపతుల గోలతో మొదటికే మోసం
టెక్కలి ఇంచార్జిగా దువ్వాడ శ్రీను ఉండేవారు. ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చి అచ్చెన్నతో పోటీ పడమని వైసీపీ అధినాయకత్వం పూర్తి స్వేచ్చ ఇచ్చింది. కానీ దువ్వాడ తన దూకుడుతో సొంత పార్టీ నేతలను కూడా దూరం చేసుకున్నారని టాక్. అంతే కాదు ఆయన స్వయంగా వర్గ పోరుని ప్రోత్సహించారని అంటారు. దాంతో ఆయన్ని తప్పించి టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ శ్రీను సతీమణి వాణికి టెక్కలి ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ఆమె పార్టీ పగ్గాలు అందుకున్నా ఏ మాత్రం బండి ముందుకు కదలడంలేదు. దాంతో ఇపుడు సరైన క్యాండిడేట్ నే బరిలోకి దింపాలని జగన్ పక్కాగా డిసైడ్ అయ్యారని అంటున్నారు.
టెక్కలి సీటు మాజీ ఎంపీ కిల్లి కృపారాణికి !?
కేంద్ర మాజీ మంత్రి శ్రీకాకుళం మాజీ ఎంపీ అయిన డాక్టర్ కిల్లి కృపారాణికి టెక్కలి ఎమ్మెల్యే టికెట్ వైసీపీ ఇస్తుందని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆమె సొంత నియోజకవర్గం టెక్కలి. ఆమెకు కనుక టికెట్ ఇస్తే అటు వైసీపీ అంతా ఒక్కటిగా పనిచేస్తుంది అని అంటున్నారు. పైగా ఆమె పోటీలో ఉంటే వైసీపీకి ప్లస్ అవుతుందని అచ్చెన్న రాజకీయానికి కూడా చెక్ పడుతుందని అంటున్నారు. పదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్న మీద వ్యతిరేకత ఉంది. బలమైన కాళింగ సామాజికవర్గం ఈసారి తమవారే ఎమ్మెల్యే కావాలని భావిస్తున్నారు. దాంతో ఆ సామాజికవర్గానికి చెందిన కృపారాణిని పోటీకి పెడితే తప్పకుండా గెలిపించుకుంటారని అంటున్నారు. టీడీపీకి బలమున్న సంతబొమ్మాళిలో కూడా వైసీపీ పట్టు సాధిస్తుందని అంటున్నారు.
లోక్‌సభకు తమ్మినేని సీతారాం ?
కృపారాణి వైసీపీలో 2018లో చేరారు. గత అయిదేళ్ళుగా ఆమె పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆమె రాజ్యసభ సీటు ఆశించారు. కానీ చివరి నిముషంలో తప్పిపోయింది. లోక్ సభకు ఆమెను పంపాలని ఒక దశలో అనుకున్నా టెక్కలి నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేయిస్తే కరెక్ట్ డెసిషన్ అవుతుందని హై కమాండ్ భావిస్తోంది. ఆమె కూడా అసెంబ్లీకి పోటీ చేయాలనే చూస్తున్నారు. ఇక కాళింగులలో బలమైన నేతగా ఉన్న తమ్మినేని సీతారాం ని లోక్ సభకు పోటీ చేయిస్తారు అని టాక్ ఉన్న నేపధ్యంలో అసెంబ్లీలోకి అదే సామాజికవర్గం నుంచి కృపారాణికి తీసుకుని వస్తారని అంటున్నారు.సో కృపారాణి టెక్కలి అభ్యర్ధి అయితే అచ్చెన్నకు టఫ్ ఫైట్ ఖాయం అంటున్నారు.