కేంద్రానికి కొమ్ము కాస్తున్నారంటూ గవర్నర్లపై ఆరోపణలు చేయడం మామూలు విషయమైపోయింది. బిల్లులను తొక్కిపెడుతున్నారంటూ కోర్టులకెక్కడం సర్వసాధారణమైపోయింది. ఇప్పుడు ఏకంగా గవర్నర్లపై దాడులకు తెగబడే పరిస్థితి వచ్చింది. అలాంటి ఓ సంఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగింది…
గవర్నర్ వాహనంపై ఎస్ఎఫ్ఐ దాడులు
కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి, గవర్నర్ అరీఫ్ మొహ్మద్ ఖాన్ కు మధ్య బిల్లుల వివాదం చాలా రోజులుగా నడుస్తోంది. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర పడటం లేదంటూ ప్రభుత్వ పెద్దలు తరచూ ఆగ్రహం చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఢిల్లీ బయలుదేరిన గవర్నర్ ఖాన్ కాన్వాయ్ ను సీపీఎం అనుబంధ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) కార్యకర్తలు అడ్డుకున్నారు. కారు చుట్టూ నిలబడి నినాదాలివ్వడంతో పాటు కారుపై కర్రలతో గట్టిగా కొట్టారు. నల్లజెండాలు చూపిస్తూ తిట్ల దండకం అందుకున్నారు. పలు చోట్ల ఇదే తంతు జరిగింది. గవర్నర్ కారు దిగి నిల్చోవడంతో ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు తాము తెచ్చుకున్న కారు ఎక్కి వెళ్లిపోయారు..
సీఎం చేయించారంటున్న గవర్నర్
తనపై హత్యాయత్నం జరిగిందని గవర్నర్ అరీఫ్ మొహ్మద్ ఖాన్ ఆరోపించారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత మొత్తం వ్యవహారాన్ని మీడియాకు వివరించడమే కాకుండా కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. సీఎం విజయన్ స్వయంగా జనాన్ని పంపి తనపై భౌతికదాడికి పురిగొల్పాలని ఆయన అన్నారు. పోలీసుల అనుమతి లేనిదే విద్యార్థులు అంత దగ్గరగా ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. విజయన్ ఆదేశాల మేరకు పోలీసులు పనిచేశారని, వాళ్లే దగ్గరుండి జనాన్ని కారులో ఎక్కించి పంపేశారని గవర్నర్ ఖాన్ మరో ఆరోపణ
శాంతి భద్రతలు లోపించాయన్న విపక్షాలు..
మొత్తం వ్యవహారంపై పోలీసు శాఖ వివరణ ఇచ్చింది. ఎలాంటి దాడి జరగలేదని కేవలం రెండు చోట్ల నిరసనలు జరిగాయని ప్రకటించింది. దీనికి సంబంధించి ఏడుగురిపై కేసులు పెట్టామని, విచారణ జరుగుతోందని తెలిపింది. అయితే గవర్నర్ వాహనం మీదకు విద్యార్థులు దూసుకెళ్లేంత వరకు పోలీసులు ఏం చేస్తున్నారని విపక్ష కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి. దాడికి దిగినవారితో పాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యమూ, అధికార పార్టీ పట్ల పక్షపాతం వహించిన పోలీసులపైనా హత్యాయత్నం కేసు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయనేందుకు ఇదో నిదర్శనమని బీజేపీ కేరళ అధ్యక్షుడు కే. సురేంద్రన్ ఆరోపించారు. పోలీసుల అనుమతి లేనిదే ఎస్ఎఫ్ఐ సభ్యులు అంతగా రెచ్చిపోయే అవకాశం లేదని ఆయన అంటున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటుంటే అధికార వామపక్ష కూటమిలో అంతటి అసహనం పెరిగిపోవడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదన్నారు…