వెయ్యి రకాల కూరగాయలు..అసలు విన్నారా ఎప్పుడైనా !

కూరగాయల పేర్లు చెప్పండి అంటే టకటకా ఓ పది పదిహేను రకాలు చెప్పగలరేమో. అయితే మన పురాణాల్లో 1008 రకాల కూరగాయల గురించి ఓ ప్రస్తావన ఉంది. స్వయంగా విశ్వామిత్రుడు అడిగితే విశిష్ట మహర్షి భార్య అయిన అరుంధతి వండి వడ్డించింది.

మార్కెట్ కి వెళ్లి మొత్తం తిరిగినా ఆకుకూరలతో కలపి ఎన్ని లెక్కెట్టినా కనీసం 200 కూడా లెక్క ముందుకు వెళ్లదేమో. మరి 1008 కూరగాయల సంగతేంటి..నిజంగా అరుంధతి అన్ని వండిపెడితే విశ్వామిత్రుడు తిన్నాడా …అసలు ఈ ప్రస్తావన ఎక్కడ మొదలైందో తెలియాలంటే పురాణాల్లో ఉన్న ఓ సంఘటన గురించి తెలుసుకోవాలి.

భోక్తగా విశ్వామిత్రుడు
ఓ సారి తన తండ్రి తద్దిన సందర్భంగా భోక్తగా ( భోజనానికి) రమ్మని వశిష్ఠ మహర్షి… విశ్వామిత్రుడిని పిలిచారు. సరే అన్న విశ్వామిత్రుడు ఓ షరతు విధించాడు.తనకు వెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి వడ్డించాలని కోరాడు. భోక్తగా వచ్చిన వ్యక్తి సంతృప్తిగా భోజనం చేసినప్పుడే పితృదేవతలు శాంతిస్తారని అంటారు. అప్పుడు సరే అన్న వశిష్ట మహర్షి అదే విషయం తన భార్య అరుంధతికి చెబుతాడు

వండి వడ్డించిన అరుంధతి
కార్యక్రమం రోజున చెప్పినట్టే విశ్వామిత్రుల వారు వశిష్టుడి ఇంటికి భోజనానికి వచ్చారు. అరటి ఆకు వేసిన అరుంధతి… కాకర కాయకూర, పనస పండు, నల్లేరు తీగతో పచ్చడి , కొన్ని కూరలు మాత్రమే వడ్డించింది. అదిచూసిన తర్వాత విశ్వామిత్రుడు ఆగ్రహంతో..1008 రకాల కూరలు ఎక్కడున్నాయి అని అడిగాడు. స్పందించిన వశిష్ఠుడు…తమరి మాటను అరుంధతికి చెప్పానని ఆమె అలాగే చేస్తానని చెప్పిందన్న మాట చెబుతాడు. అప్పుడు అరుంధతి విశ్వామిత్రుడి ముందుకు వచ్చి ఓ శ్లోకం చెప్పింది.

కారవల్లీ శతం చైవ వజ్రవల్లీ శత త్రయం
పనసమ్ షట్ శతశ్చైవ శ్రాద్ధకాలే విధీయతే

ఈ శ్లోకం అర్థమేంటంటే…శ్రాద్ధ సమయంలో వడ్డించిన వంటల్లో…
ఒక కాకరకాయ – నూరు కూరగాయలతో సమానం
వజ్రవళ్ళి (నల్లేరు) పచ్చడి – 300 కూరలకు సమానం
పనసపండు – 600 కూరలకు సమానం
ఈ మూడు కలిపితే మొత్తం వెయ్యి కూరలు. ఇవికాక ఇంకొక ఎనిమిది రకాల కూరలు వండి వడ్డించాను అని చెప్పి నమస్కరించింది. అది విన్న విశ్వామిత్రుల వారు మారు మాట్లాడకుండా భోజనం చేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి 1008 కూరగాయల ప్రస్తావన అలా ఉండిపోయింది.

గమనిక: కొందరు పండితుల నుంచి, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.