తెలంగాణలో బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. ఈ కూటమిలో జనసేన ఒక్క సీటు కూడా గెలవకపోయినప్పటికీ బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచింది. దీంతో ఈ కూటమి సక్సెస్ అయిందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే హఠాత్తుగా కిషన్ రెడ్డి పేరుతో సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు తప్పుడు ప్రచారం ప్రారంభించాయి. కిషన్ రెడ్డి అనని మాటల్ని అన్నారంటూ.. విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. జనసేనతో పొత్తు వల్ల బీజేపీ నష్టపోయిందని కిషన్ రెడ్డి అన్నారని ఆ ప్రచారం సారాంశం.
తప్పుడు ప్రచారంపై పోలీసులకు కిషన్ రెడ్డి ఫిర్యాదు
సోషల్ మీడియాలో తాను అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేస్తున్న వైనం .. తన దృష్టికి రాగానే కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అత్యవసరం మీడియాకు సందేశం పంపించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేయాలన్నది రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్నదేనని స్పష్టం చేశారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము.. జనసేనతో కలిసి బరిలో దిగామని తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని.. ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
బీజేపీ జనసేనను విడగొట్టాలని చూస్తోందెవరు ?
తెలంగాణలో బీజేపీ, జనసేన బంధం కొనసాగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో సరైన ఫలితాలు రాకపోవడానికి ఉన్న కారణాలపై బీజేపీ, జనసేన అంతర్గతంగా పరిశీలన చేసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత ఉండకూడదని కొంత మంది కోరుకుంటున్నారు. ఏపీకి చెందిన ఓ రాజకీయ పార్టీ.. ఈ కుట్రలు చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీకి చెందిన వారే కిషన్ రెడ్డి మాటల్ని వైరల్ చేస్తున్నారు. బీజేపీతో జనసేనను విడగొడితే.. ఏపీలో తాము పొత్తులు పెట్టుకోవచ్చని… బీజేపీతో కలిసి ఉంటే ఎప్పటికైనా తమ దరికి జనసేన రాదన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మోదీ నాయకత్వంపై జనసేనానికి నమ్మకం
జనసేనాని పవన్ కల్యాణ్ పూర్తిగా మోదీ నాయకత్వంపై నమ్మకంతో ఉన్నారు. దేశానికి మోదీ లాంటి నాయకుడు ఉండాల్సిదేనని ఆయన అంటున్నారు. అందుకే ఆయన బీజేపీతో కొనసాగాలనుకుంటున్నారు. ఇతర రాజకీయ పార్టీలతో తాత్కలిక అవసరాల కోసం కలిసినా.. పవన్ కల్యాణ్ అంతిమంగా బీజేపీతోనే ఉంటారు. ఈ విషయంపై ఇతర పార్టీలకూ స్పష్టత ఉంది. అందుకే బీజేపీతో ఆయన బంధాన్ని తెంపేయడానికి ఫేక్ న్యూస్ ప్రచారాన్ని నమ్ముకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.