శరవేగంతో అయోధ్య రామాలయ పనులు

ప్రపంచ హిందువులంతా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం త్వరలోనే రాబోతోంది. అయోధ్య రామాలయ నిర్మాణ పనులు చిపరి దశకు చేరుకున్నాయి. దాదాపు అన్ని పనులు పూర్తి చేసి ప్యాచ్ వర్క్ జరుగుతోందని ఆలయ కమిటీ వెల్లడించింది. 2024 ప్రారంభంలో అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఆ దిశగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి….

తాజా చిత్రాలు విడుదల

అయోధ్య ఆలయ గర్భగుడికి సంబంధించిన తాజా చిత్రాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. గర్భగుడి పనులు దాదాపుగా పూర్తయినట్లు ఆ చిత్రాలను బట్టి తెలుస్తోంది. లైటింగ్ – ఫిట్టింగ్ పనులు సైతం ఇటీవలే పూర్తయ్యాయి. ఈ ఫోటోలను ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ విడుదల చేస్తూ పనుల పురోగతిని వివరించారు. డిసెంబర్‌ చివరి నాటికి ఫస్ట్‌ ఫేజ్‌ పనులు పూర్తిచేయడమే లక్ష్యంగా రాత్రింబవళ్లు వర్క్స్‌ కొనసాగుతున్నాయి. నగరా స్టైల్‌లో ఆలయ నిర్మాణం జరుగుతోంది. ప్రధానంగా పింక్‌స్టోన్‌ మార్బుల్‌తో నిర్మిస్తున్నారు. ఆ రాయిని రాజస్థాన్‌లో మిర్జాపూర్‌, బన్సీ పహర్‌పూర్‌ నుంచి తెప్పించారు. 2 టన్నుల బరువుండే ఒక్కో రాయిని కట్‌ చేసి వినియోగిస్తున్నారు. 21లక్షల క్యూబిక్‌ ఫీట్ల రాయి కోసం.. దాదాపుగా 17వేల గ్రానైట్‌ బండలను ఉపయోగించారు. ఆలయ ఆర్కిటెక్ట్‌ చంద్రకాంత్‌ భాయ్‌ సోంపుర నేతృత్వంలో పనులు జెట్‌ స్పీడ్‌లో జరుగుతున్నాయి. మొత్తంగా 71 ఎకరాల్లో టెంపుల్ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. ప్రధాన ఆలయం మాత్రం 3 ఎకరాల్లో నిర్మాణం జరుగుతోంది. దాదాపుగా 1800 కోట్ల అంచనా వ్యయంతో పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం పొడవు 380 ఫీట్లు, వెడల్పు 250ఫీట్లు ఉండనుంది. ఇక గర్భాలయ గోపురం పొడవు 161 ఫీట్లుగా ఉంటుంది.

జనవరి 22 కోసం నిరీక్షణ

2024 జనవరి 22 మధ్యాహ్నం 12.45కు గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన ద్వారా రామాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరవుతారు. మృగశిర నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో అయోధ్య రామయ్య విగ్రహానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట జరుగనుంది. లక్ష్మీకాంత్‌ మథురనాథ్‌ దీక్షిత్‌ అనే 86 ఏండ్ల పండితుని చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతుంది.ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదమంత్రోచ్ఛరణ కోసం నాలుగు వేల మంది సాధుసంతులను ఆహ్వానించారు. నిజానికి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 16 నుంచే ప్రారంభమవుతుంది. జనవరి 14 నుంచి 22 వరకు ప్రధాన క్రతువులు నిర్వహిస్తారు. జనవరి 22న అమృత మహోత్సవంలో భాగంగా 1008 హుండీ మహాయాగం జరుగుతుంది.

లక్షల మంది హాజరయ్యే అవకాశం

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేలాది మందికి ప్రసాద వితరణ జరుపుతామని ట్రస్టు పెద్దలు చెబుతున్నప్పటికీ లక్షలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. పది నుంచి పన్నెండు రోజులు ఉండే విధంగా జనం హోటల్ బుకింగ్స్ చేసుకుంటున్నారని స్థానిక పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. యాత్రికుల సేవలో అయోధ్య వాసులు తరించాలని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.