ఒకప్పుడు అన్ని వర్గాల ప్రజలకు స్వర్గధామమైన తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలో ఇప్పుడు పౌరులు భయంతో వణికిపోయే పరిస్థితిలోకి నెట్టబడ్డారు. ఈశాన్య రుతుపవనాలతో అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య వచ్చే భారీ వర్షాలు ప్రతీ ఏటా జనాన్ని ఇబ్బంది పెట్టడం సహజంగా జరిగేది. ఇప్పుడు మిచాంగ్ తుపాను సృష్టించిన బీభత్సంతో చెన్నై వాసుల పరిస్థితి మరింత ఆగమ్యగోచరమైంది.
పదుల సంఖ్యలో మృతులు..
మంగళవారం తుపాను తీరాన్ని దాటింది. అప్పటికే వర్షాలతో చెన్నై మహానగరంలో చాలా చోట్ల మోకాలి లోతు నీళ్లు నిలిచి ఉన్నాయి. తుపాను ప్రభావంతో వరద మరింతగా పెరిగిపోయి.. నీళ్లు నడుముల లోతు దాటిపోయాయి. ఇళ్ల నుంచి బయటకు రాలేని దుస్థితిలోకి నగర పౌరులు పడిపోయారు.ఆహార పదార్థాలు, పాలు కొనుక్కునేందుకు కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంది. సంపన్నులను, రాజకీయ పలుకుబడి ఉన్న వారిని మాత్రమే బోట్లలో సురక్షిత ప్రదేశాలకు తీసుకెళ్లగా, పేద మధ్య తరగతి ప్రజలకు వారి దుస్థితికి వదిలేశారు. తిండి లేక అలమటిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనం ఇప్పటికీ ఆవేదన చెందుతున్నారు. వరద నీటిని తోడి పోసేందుకు, రోడ్ల మీద నుంచి తొలగించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టిన పాపాన పోలేదు..
తిండి, నీరు లేక హాహాకారాలు
చెన్నై జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దానితో కాలనీలు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. జనాభాకు తగినట్లుగా వసతులు కల్పించడంలో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు విఫలమయ్యాయి. స్టాలిన్ సర్కారు అధికారానికి వచ్చి రెండేళ్లు దాటినా ఇంతవరకు వరద నీరు త్వరగా పారేందుకు వీలుగా డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాని ప్రభావం ఇప్పుడు జనంపై కనిపించింది. రోడ్లలో పెట్టిన కార్లు కొట్టుకుపోయేంతగా వరద వచ్చిందంటే చెన్నై ఎంతటి దీనస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్యాస్ అయిపోయి, కరెంట్ లేక వంట చేసుకునే అవకాశం కోల్పోయిన వేలాది కుటుంబాలు.. ఎవరైనా పట్టెడన్నం పెడతారని ఇవ్వాల్టికీ ఎదురు చూస్తున్నారు. ముసలి వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాళ్లు ఇల్లు కదల్లేరు. ఇంట్లో ఉంటే ఆహారం, మంచినీరు అందడం లేదు.
2015 నాటి పరిస్థితే…
చెన్నై నగరంలో 2015 మరిచిపోలేని సంవత్సరం. అప్పుడు వచ్చిన వరదలకు నగరంలోని 90 శాతం ప్రాంతం నీట మునిగింది. వందల కోట్ల ఆర్థిక నష్టం సంభవించింది. కాలనీల్లో నిలిచిన వరద నీరు పోవడానికి కనిష్టంగా నెల రోజులు పట్టింది. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. గత పక్షం రోజులుగా పరిస్థితి దారుణంగా తయారై వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రతీ మధ్య తరగతి కుటుంబానికి పది నుంచి పది లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. ప్రభుత్వాధికారులు,ప్రజా ప్రతినిధులు జనంలోకి వచ్చేందుకే వెనుకాడే పరిస్థితి ఉంది. జనం నిలదీస్తే సమాధానం చెప్పుకోవడం కష్టమని వాళ్లు భయపడుతున్నారు. 2015కు ఇప్పటికీ ఒకటే తేడా. అప్పుడు జయలలిత సీఎంగా ఉండేవారు. ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిగతాది అంతా సేమ్ టు సేమ్….