నోటా కంటే నీచంగా – ఆప్ పరిస్థితేమిటో..

రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటూ జాతీయ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), మూడు ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. మూడు రాష్ట్రాల్లోనూ పోటీ చేసి ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయి పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకుంది. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలను చూస్తే ఆప్ పరిపతి ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది.

ఒక శాతం కంటే తక్కువ ఓట్ షేర్..

ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్టీ పంజాబ్ లోనూ పాగా వేసింది. ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలన్న ఆాకాంక్షతో బరిలోకి దిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ఎక్కడా ఆ పార్టీకి డిపాజిట్లు దక్కలేదు. పోటీ చేసిన మొత్తం 205 స్థానాల్లోనూ ఘోర పరాజయం పాలైంది. మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలుంటే 66 చోట్ల, రాజస్థాన్లో 200 స్థానాలుంటే 85 చోట్ల, ఛత్తీస్ గఢ్ లో 90 స్థానాలుంటే 54 చోట్ల ఆప్ బరిలోకి దిగింది. మధ్యప్రదేశ్లో ఆప్ కు 0.53 శాతం ఓట్లు వచ్చాయి. అది నోటాకు వచ్చిన 0.98 శాతం కంటే తక్కువ. రాజస్థాన్లో 0.38 శాతం, ఛత్తీస్ గఢ్ లో 0.93 శాతం ఓట్లు మాత్రమే సాధించింది.

ఆందోళనకర ఫలితాలేనంటున్న విశ్లేషకులు..

అవినీతి వ్యతిరేకోద్యమంలో పుట్టి, సుపరిపాలన అందించేందుకు అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇలాంటి ఫలితాలు రావడం షాకిచ్చిన అంశమేనని విశ్లేషకులు అంటున్నారు. 2022లో పంజాబ్ విజయం తర్వాత పార్టీ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని అనుకుంటే జరుగుతుంది వేరుగా ఉందని చెబుతున్నారు. గోవా అసెంబ్లీలో రెండు స్థానాలు, గుజరాత్ ఎన్నికల్లో ఐదు చోట్ల గెలిచిన తర్వాత ఆప్ ఎక్కడా ఉనికిని చాటుకోలేకపోయింది. కర్ణాటక, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఓటర్లు ఆ పార్టీకి మొండిచేయి చూపించారు. 28 పార్టీల ఇండియా గ్రూపులో కీలక భూమిక పోషించాలనుకుంటున్న ఆ పార్టీకి ఇలాంటి పరిస్థితేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

పంజాబ్ పరిణామాలే కారణమా…

పంజాబ్ లో అరాచక పాలనతోనే ఆప్ పతనం ప్రారంభమైందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాలనా లోపాలు, ఆయన తాగుబోతుతనం పార్టీ ఇమేజ్ ను డేమేజ్ చేసేసింది. అక్కడి ఎన్నికల ముందు 18 ఏళ్లు దాటిన ప్రతీ పంజాబ్ మహిళ ఖాతాలో నెల నెల వెయ్యి రూపాయలు జమ చేస్తానని ఆప్ హామీ ఇచ్చి మాట తప్పింది. ఇప్పటికీ ఆ హామీ నెరవేర్చుతారని కోటి 30 లక్షల మంది పంజాబ్ మహిళలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పనులకు నిధలు లేకపోయినా ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పంజాబ్ అభివృద్ధి పేరిట పేజీల లెక్కన ప్రకటనలిచ్చి ప్రభుత్వ ఖజానాను వృథా చేసింది.దీనితో ఇతర రాష్ట్రాలకు కూడా ఆప్ చేతగానితనం, వృథా వ్యయం తెలిసిపోయాయి. పైగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ నేతల ప్రమేయం, వారి చేతివాటం దేశ వ్యాప్తంగా ప్రచారమై.. ఆ పార్టీని ఆదరించేందుకు సగటు ఓటరు సుముఖత వ్యక్తం చేయలేదు. దానితో ఆప్ మూడు రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైంది.