ధూప దీపాల్లో అగరబత్తి వెలిగించడం భాగం. వీటి నుంచి వచ్చే పరిమళమైన సువాసన నూతన ఉత్తేజాన్ని నింపుతుంది..చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. దేవుడిపై భక్తితో రెండో మూడో వెలిగించినంతవరకూ సరే కానీ..కొందరైతే అగరబత్తిలను దోమల్ని చంపేందుకు కూడా వినియోగిస్తున్నారు. ఒక్కో రూమ్ లో అరడజనుకి పైగా వెలిగించేస్తున్నారు. స్మెల్ బావుంది అనుకుంటున్నారు కానీ దానివల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు అటాక్ చేస్తాయో ఆలోచించలేకపోతున్నారు.
అగరబత్తి పొగలో విషతుల్యమైన పదార్థాలు
అగరబత్తిని వెలిగించినప్పుడు వెలువడే పొగలో బెంజీన్, కార్బొనైల్ మరియు పాలీ అరోమాటిక్ హైడ్రో కార్బన్స్ వంటి క్యాన్సర్ కారక విషతుల్యమైన పదార్ధాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
తయారీలో ఏం ఉపయోగించారో
మనం వాడే అగరబత్తిలను ఎలాంటి పదార్ధాలను ఉపయోగించి తయారు చేశారో తెలుసుకోవడం ముఖ్యమైన విషయం. వీటి తయారీలో మన శరీరానికి హాని కలిగించే పదార్ధాలను మరియు నూనెలను వాడుతారు. అటువంటి వాటిని మండించినప్పుడు అవి మన ఆరోగ్యం పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
కంటికి మంచిది కాదు
అగరబత్తిల నుంచి వెలువడే పోగ కంటికి, చర్మానికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా పిల్లలు , గర్భిణిలపై ఈ పొగ దుష్ప్రభావం చూపుతుంది. కళ్లు మండడం, చర్మం దురదపెట్టడం లాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
శ్వాస సమస్యలున్నవారికి డేంజర్
అగరబత్తులు నిజంగా హానికరమా అంటే..ఆస్తమాతో బాధపడేవారికి డేంజరే అని చెప్పాలి. ఈ పొగ వల్ల శ్వాస సమస్యలు మరింత పెరుగుతాయి. నిత్యం ఈ పొగ పీలిస్తే పరిస్థితి తీవ్రత పెరుగుతుంది. అగరబత్తిలనుంచి వెలువడే పొగలో కార్బన్ మోనాక్సయిడ్ , ఎన్నో రకాల రసాయనాలతో పాటు నైట్రోజన్ కారకాలు ఉంటాయి. వీటి వల్ల మనం ఆస్తమాతో పటు, దీర్ఘకాళిక శ్వాస కోశ వ్యాధులు బారిన పడే అవకాశాలు ఎక్కువ.
కణాలపై తీవ్ర ప్రభావం
మీరు వెలిగించే అగరబత్తిలు, పీల్చే పొగను బట్టి మీ శరీరంలో కణాలపై ప్రభావం ఉంటుంది. ఐరన్, మెగ్నీషియం. లెడ్ వంటి రసాయన పదార్థాలతో తయారు చేసిన అగరబత్తిలను వెలిగిస్తే ఆ పొగ గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
ఇంట్లో గాలి కలుషితం
అగరబత్తుల నుంచి వెలువడే పొగ ఇంట్లో గాలిని కలుషితం చేస్తుంది. దీనివల్ల తలనొప్పి, నరాల సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మీ ఇల్లు మొత్తం ఈ పొగ నుంచి వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సయిడ్ తో నిండిపోతుంది .
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.