తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కావాల్సిన మెజార్టీ ఉంది. కానీ ఆ పార్టీకి శాసనమండలిలో అసలు బలం లేదు. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా శాసనమండలిలో ఒకే ఒక్క సభ్యుడు జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. పెద్దల సభలో బీఆర్ఎస్కు పూర్తి అధిక్యం ఉంది.
గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలను ఖాళీగా ఉంచి వెళ్లిన కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు దక్కనున్నాయి. గతంలో కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ లను కేసీఆర్ సిఫారసు చేశారు. కానీ గవర్నర్ ఆమోదించలేదు. కానీ తర్వాత మరో పేర్లను కానీ.. వారి పేర్లను కానీ గవర్నర్కు పంపలేదు. దీంతో ఆ రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు వాటిని భర్తీ చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లభించింది. ఇప్పటికి ఓ సభ్యుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు ఉన్నారు. అంటే ముగ్గురు ఎమ్మెల్సీలు మాత్రమే కాంగ్రెస్ కు ఉంటారు.
ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురు ఎమ్మెల్సీలు
మండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా బీఆర్ఎస్కు 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రస్తుతం గవర్నర్ నామినేటెడ్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు పోటీచేసి గెలుపొందారు. దీంతో వారు శాసన మండలి మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. వీరిలో బీఆర్ఎస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన శాసన సభ కోటా ఎమ్మెల్సీలైన కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి , పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇక స్థానిక సంస్థల కోటా సభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా కల్వకుర్తి నుంచి పోటీ చేసి గెలుపొందారు. వీటిలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మక ంలేదు.
బిల్లులు పాస్ చేసుకోవడం కష్ట7మే !
శాసనమండలి కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారనుంది. ఎవరికైనా ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవుల్లోకి తీసుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పదవి ఇచ్చే అవకాశం ఉంది. పదేళ్లుగా కాంగ్రెస్ నేతలకు పదవులు లేక ఇబ్బంది పడుతున్నారు. పార్టీనే నమ్ముకున్న వారికి రేవంత్ ఆ రెండు సీట్లను ఇచ్చే అవకాశం ఉంది. గత తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను గవర్నర్ ఆమోదించినట్లయితే ఎమ్మెల్సీలుగా ఆరేళ్లు ఉండేవారు. కానీ ఇప్పుడు వారికి మళ్లీ చాన్స్ రాదు.