రేవంత్‌కు వర్గ పోరు తప్పదు – భట్టి, ఉత్తమ్‌ను ప్రోత్సహిస్తోంది హైకమాండే !

బొటాబొటి మెజార్టీతో సీఎం పదవి చేపడుతున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం చెక్ పెట్టేదిశగా కదులుతోంది. పార్టీలో చేరి ఆరేళ్లు కాకుండానే ఓ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం … దశాబ్దాలుగా పార్టీనే అంటి పెట్టుకుని ఉన్న తమను కించ పర్చడమేనని సీనియర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేసినా హైకమాండ్ పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అవసరం ఉంది కాబట్టి.. ఆయనకే సీఎం పదవి ఇచ్చారు.

తెలంగాణను దోచి నిధులు కాంగ్రెస్ కు పంపాల్సిందే !

కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారం ఉంది. హిమాచల్ ప్రదేశ్ తో పాటు కర్ణాటక, తెలంగాణల్లోనే అధికారం ఉంది. ఇప్పుడు ఆ పార్టీకి నిధులు ఈ మూడు రాష్ట్రాలే సర్దాలి. హిమాచల్ ప్రదేశ్ నుంచి పిండుకోవడానికి ఏమీ ఉండదు. కర్ణాటకలో అంతకు మించిన నేతలు ఉన్నారు. వారు హైకమాండ్ నే బోల్తా కొట్టిస్తారు. ఇక రేవంత్ రెడ్డి మాత్రమే హైకమాండ్ కు బకరాలా కనిపించారని.. తెలంగాణ సొమ్ము రాబట్టుకోవచ్చని అనుకున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి.

సీనియర్లకు హైకమాండ్ ప్రోత్సాహం

రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వకుండా… హైకమాండ్ ప్రయత్నించింది. ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా ఆయనకు ఉన్నప్పటికీ మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రోత్సహించారు. వారు అడ్డం పడ్డారని చెప్పేందుకు ఢిల్లీకి పిలిపించుకున్నారు. అయితే ఇదంతా రేవంత్ కు పదవి ఇవ్వకుండా ఉండటానికి కాదు. కేవలం రేవంత్ ను బెదిరించడానికే. సీనియర్లకు తమ ప్రోత్సాహం ఉంటుందని చెప్పడానికే. దానికి తగ్గట్లుగానే రాజకీయం చేశారు. సీనియర్ల మాటలను వింటామని చెప్పి పంపించారు.

రేవంత్ సొంతంగా ఏదీ చేయలేరు అంతా.. ఢిల్లీ డైరక్షనే !

సీఎం పదవిని తము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసేయగలమని చెప్పడం ద్వారా.. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఓ సిగ్నల్ పంపింది. తాము చెప్పిందే చేయాలని.. సొంతంగా ఏమి చేసినా ఊరుకునేది లేదని సిగ్నల్స్ పంపినట్లయింది. ఇప్పుడు రేవంత్ కు కూడా ఈ అంశంపై స్పష్టత వచ్చిది. కానీ ఎవరి రాజకీయం వారు చేస్తారు. ఇందులో రేవంత్ పైచేయి సాధిస్తారా.. వారి హైకమాండా అన్నది తేలాల్సి ఉంది.