నోరు పారేసుకుని సారీ చెప్పిన డీఎంకే ఎంపీ…

తమిళనాడు అధికార పార్టీ డీఎంకే నేతలు ఇప్పుడు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఇటీవలే సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవ్వగా… ఇప్పుడు డీఎంకే ఎంపీ ఒకాయన అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నారు.

దక్షిణాది రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలు చేయండి…

డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ లోక్ సభలో మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ.. దక్షిణాదిన బీజేపీకి సీన్ లేదని అన్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లోకి ఎంటర్ కాలేదని సవాలు చేశారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఏ ఒక్క రాష్ట్రంలో బీజేపీ రాలేకపోయిందన్నారు. అక్కడ బీజేపీయేతర పక్షాలు చాలా బలంగా ఉన్నాయన్నారు. ఈ రాష్ట్రాలపై బీజేపీ కసిగా ఉందని, వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని సెంథిల్ కుమార్ విశ్లేషించారు. బీజేపీ పరోక్షంగా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోందని లోక్ సభ వేదికగా సెంథిల్ కుమార్ ఆరోపించడంతో పెద్ద దుమారమే రేగింది.

సారీ చెప్పిన సెంథిల్

సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశించారు. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. దీనితో తాను చేసిన తప్పు ఆయనకు తెలిసొచ్చింది. తన వ్యాఖ్యల ద్వారా ఉత్తరాది, దక్షిణాది విభేదాలు సృష్టించానని ఆయన ఆలస్యంగా గుర్తించారు. దానితో వివరణ ఇచ్చుకున్నారు. ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలనిచ్చాయని సెంథిల్ కుమార్ ఒప్పుకున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అన్నామలై..

డీఎంకే తీరుపై బీజేపీ తమిళనాడు శాఖాధ్యక్షుడు అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే దుష్పరిపాలనతో చెన్నై మునిగిపోతుంటే (వరదలకు)…దానిపై దృష్టి పెట్టాల్సిన వాళ్లంతా పార్లమెంటు వేదికగా ఆరోపణలు సంధిస్తున్నారని ఆరోపించారు. పుదుచ్చేరిలో బీజేపీ అధికారంలో ఉందని, ఇప్పటిదాకా కర్ణాటకను పాలించిందని అన్నామలై గుర్తుచేస్తూ డీఎంకే నేతలకు మతిమరుపు పెరిగిపోయిందన్నారు. కర్ణాటక మాజీ మంత్రి సీటీ రవి కూడా డీఎంకేపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. డీఎంకే నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమర్థిస్తారా అని రవి ప్రశ్నించారు. కాంగ్రెస్ మిత్రపక్షాలంతా కలిసి భారతీయుల్ని అవమానపరుస్తున్నారని ఆయన అన్నారు. మరి దీనికి హస్తం పార్టీ సమాధానమేమిటో చూడాలి….