నవగ్రహాల్లో ఏ గ్రహ దోషానికి ఏ చెట్టుని పూజించాలి

జాతకంలో నవగ్రహాల దోషాల నుంచి విముక్తి కోసం ఎన్నో పూజలు, దానాలు, జపాలు చేస్తుంటారు. నవగ్రహాల ఆలయాల చుట్టూ ప్రదిక్షిణలు చేస్తుంటారు. అయితే మీకున్న గ్రహదోషం ఆధారంగా మీరు నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. గ్రహదోషం ఆధారంగా ఏ చెట్టుని పూజించాలో సూచిస్తున్నారు.

సూర్య గ్రహ దోషం
జాతకంలో సూర్య సంచారం సరిగా లేనప్పుడు, రాహు కేతు దోషం ఉన్నవారు జిల్లేడు మొక్కను పూజించాలి. ముఖ్యంగా సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజు జిల్లేడు మొక్క పూజచేయాలి.

చంద్ర గ్రహ దోషం
జాతకంలో చంద్రుడి దోషం ఉన్నప్పుడు మోదుగ వృక్షాన్ని పూజించాలి. పరమేశ్వరుడికి నీటితో నిత్యం అభిషేకం చేయాలి. మోదుగ చెట్లను పూజించడం వల్ల బాధలు కూడా దూరమవుతాయి.

అంగారక దోషం
అంగారకుడు శుభగృహంలో లేనప్పుడు మర్రిచెట్టుని పూజించడం ద్వారా శుభం జరుగుతుంది. 11 మంగళవారాలు మర్రిచెట్టుకు నీళ్లు సమర్పించి 5 ప్రదక్షిణలు చేస్తే …అంగారకుడితో పాటూ కుజుడు, రాహువు దోషాలు కూడా తొలగిపోతాయి.

బుధుడి దోషం
జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం తగ్గడానికి ఉత్తరేణి మొక్కను పూజించాలి.

గురు గ్రహ దోషం
జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి అత్యంత శుభ గ్రహం. బృహస్పతి సాధారణంగా మంచి చేస్తుంది…అయితే జాతకంలో రాహు-కేతువులతో కలిసి ఉంటే బలహీన ఫలితాలనిస్తుంది. అది జాతకుడిపై దోషాన్ని చూపిస్తుంది. ఇలాంటి వారు రావి చెట్టును పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. రావి చెట్టుకు నీరు పోసి ప్రదిక్షిణలు చేయాలి

శుక్ర గ్రహ దోషం
శుక్రుడికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే లేదా దుష్ట గ్రహాలతో సంబంధం కలిగి ఉంటే అది దోషం అవుతుంది. అప్పుడు మీ జీవితంలో సుఖాలు, విలాసాలకి ఎండ్ కార్డ్ పడినట్టే. అలాంటి వారు మేడి చెట్టును పూజించాలి.

శని దోషం
జాతకంలో ఏ గ్రహం గురించి తెలిసినా తెలియకపోయినా శని పేరు చెబితే భయపడని వారుండరు. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్థాష్టమ శని ఉన్నప్పుడు పరిస్థితి మరింద దారుమంగా ఉంటుంది. శనిదోషం ఉన్నవారు ప్రతిరోజూ జమ్మిచెట్టుని పూజించాలి. శనివారం నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి

రాహు – కేతు గ్రహ దోషం
జ్యోతిషశాస్త్రంలో రాహువు, కేతువు గ్రహాలని క్రూరమైనవిగా భావిస్తారు. వీటిని శాంతింపజేయడానికి దూర్వాలతో గణేషుడిని పూజించాలి.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.