కాంగ్రెస్‌లో సునీల్ కనుగోలు రచ్చ – ఆ మూడు రాష్ట్రాల్లో పరాజయం ఎవరిది బాధ్యత ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు పాత్ర చాలా ఎక్కువ అని ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ల స్ట్రాటజిస్టుగా సునీల్ కనుగోలు..బాధ్యతలు తీసుకున్న తర్వాత కర్ణాటకలో గెలిపించారు. ఆ తర్వాత తెలంగాణ బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఇవి గెలుపులే. ఓటములు కూడా ఉన్నాయి. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలవాల్సిన చోట కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. మరి దీనికి ఆయన బాధ్యత వహించరా ?. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన స్ట్రాటజిస్టుగా పని చేశారు.

గెలిపిస్తాడని సునీల్ కనుగోలును నెత్తిన పెట్టుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏ నిర్ణయం జరగాలన్నా సునీల్ కనుగోలు రిపోర్ట్ ఆధారంగానే చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రచార వ్యూహాలు అన్నీ ఆయనే నిర్వహిస్తారు. ఆయనకు కాంగ్రెస్ కోర్ కమిటీలో సభ్యత్వం కూడా ఇచ్చారు. ఇంత చేసినా ఆయన సాధిస్తున్న విజయాలు మాత్రం అంతంత మాత్రమే. అయితే పబ్లిసిటీ చేసుకోవడంలో సునీల్ కనుగోలు స్టైలే వేరు కాబట్టి.. ఆ ప్రకారం ఆయనకు మైలేజీ వస్తోంది. ఓడిపోయిన రాష్ట్రాల గురించి మాత్రం చెప్పడం లేదు.

హిందీ రాష్ట్రాల్లో ముఖ్య నేతలు కనుగోలు సలహాలు తీసుకోలేదని ప్రచారం

తెలంగాణలో పారిన సునల్ కనుగోలు వ్యూహాలు మూడు రాష్ట్రాల్లో ఉపయోగపడలేదు. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో ఆయన ప్లాన్లు ఎందుకు పారలేదని కనుగోలు వ్యతిరేకులు అయిన కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ కనుగోలు టీం కాంగ్రెస్ నేతలపైనే ఎదురుదాడికి దిగుతున్నారు అక్కడ ఉన్న కాంగ్రెస్ పెద్ద నాయకులు అశోక్ గెహ్లాత్ , కమల్ నాథ్ వంటి వారు సునీల్ కనుగోలుకు హిందీ బెల్ట్ రాజకీయాల గురించి తెలియదని.. ఆయన సలహాలు సూచనలు పాటించలేదని చెబుతున్నాయి. తమ కంటే పెద్ద స్ట్రాటజిస్టులు ఎవరు ఉంటారని వారు ఫీలయ్యారని.. పార్టీని బొంద పెట్టారని అంటున్నారు. అంటే తప్పిదాన్ని కాంగ్రెస్ నేతలకే వదిలేస్తున్నారన్నమాట.

సునీల్ కనుగోలును నమ్ముకుంటే కాంగ్రెస్‌కు అథోగతే !

రాజకీయ నేతలు సొంతంగా రాజకీయాలు చేయకుండా స్ట్రాటజిస్టులను పెట్టుకుంటే… పార్టీలన్నీ అథోగతి పాలవుతాయి. తాత్కలికంగా ఒకటి రెండు విజయాలు వచ్చినా అంతిమంగా అది.. పార్టీ పరాజయానికి దారి తీస్తుంది. పతనానికి కారణం అవుతుంది. కాంగ్రెస్ పార్టీది ప్రస్తుతం అదే పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల తరవాత తాము ఎంత తప్పు చేశారో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.