మూడు ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని విజయం అందివచ్చింది. ఎగ్జిట్ పోల్స్ ను తలదన్ని ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కమలం పార్టీ విజయం సాధించింది. దీనితో లోక్ సభ ఎన్నికల్లో సైతం హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే 2024లో పునరావృతమవుతాయని ఆయన చెప్పారు. ఇప్పుడు అమలు చేసిన వ్యూహాలే లోక్ సభ ఎన్నికల్లోనూ పాటిస్తామని బీజేపీలో అంతర్గతంగా వినిపిస్తున్న మాట…
మోదీ పేరులోనే ప్రభంజనం
మోదీ పేరులోనే ఒక సమ్మోహనం, ప్రభంజనం ఉందని బీజేపీ విశ్వసిస్తోంది. తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించకుండా మోదీని చూసి ఓటెయ్యాలని కోరారు. దానితో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై ఉన్న వ్యతిరేకత కొట్టుకుపోయింది. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే పట్ల సానుకూలతలేకపోయినా జనం మోదీ పేరును విశ్వసించారు. ఛత్తీస్ గఢ్ లో పరాజయాన్ని విజయంగా మార్చుకోవడం కూడా మోదీపేరుతోనే అని తెలిసింది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో మోదీని చూసి ఓటెయ్యండని ఇప్పటి నుంచే బీజేపీ ప్రచారం ప్రారంభిస్తోంది. ఇదీ పార్టీ కేడర్లో కూడా నూతనోత్సాహానికి కారణమవుతుంది.
ఇకపై అన్ని మోదీ గ్యారెంటీలే…
కాంగ్రెస్ గ్యారెంటీలు కొట్టుకుపోయి. మోదీ గ్యారెంటీలు జనంలోకి బాగా వెళ్లిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉచితాలను ప్రకటించినా మోదీ ఇచ్చిన హామీలనే జనం నమ్మారు. పాలనలో బీజేపీ మాత్రమే సమర్థవంతమైన పార్టీ అని జనంలోకి బాగా వెళ్లిపోయింది. ఇదే ట్రెండును లోక్ సభ ఎన్నికల వరకు కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది.
ఎస్సీ, ఎస్టీల మద్దతు
బీజేపీకి ఎస్సీ, ఎస్టీల మద్దతు ఉందని అసెంబ్లీ ఎన్నికలు తేల్చేశాయి. ఛత్తీస్ గఢ్లో ఎస్టీలకు 29 స్థానాలు కేటాయిస్తే అందులో 17 బీజేపీ గెలుచుకుంది. మధ్యప్రదేశ్లో 47 ఎస్టీ సీట్లలో 27 బీజేపీకి వచ్చాయి. రాజస్థాన్లో 25 ఎస్టీ స్థానాల్లో 13 కమలం పార్టీకి దక్కాయి. ఇక ఎస్సీ సీట్ల విషయానికి వస్తే మధ్యప్రదేశ్లోని 35 ఎస్సీ స్థానాల్లో 27 బీజేపీ ఖాతాలోకి చేరిపోయాయి. రాజస్థాన్లోని 33 స్థానాల్లో 21 వచ్చాయి. మధ్యప్రదేశ్లో ఓబీసీ ఓటర్లు ఎక్కువగా ఉండే 67 నియోజకవర్గాల్లో 49 బీజేపీకి వచ్చాయి. అక్కడ పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటేశారు. అధికపక్షం మహిళలు బీజేపీ వైపు ఉన్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బడుగు బలహీన వర్గాలు బీజేపీకి మద్దతు ఇవ్వడం వెనుక అణగారిన వారిని ఆదుకోవాలన్న కమలం పార్టీ సంకల్పమే కనిపిస్తుంది. కులగణన పేరుతో పేదప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగిస్తోందని బీజేపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు. దేశంలో పేదలే అతిపెద్ద కులమని వారికి న్యాయం చేసిన రోజున కులవ్యవస్థపై పోరాటంలో విజయం సాధిస్తామని మోదీ పదే పదే చెప్పారు. ఇకపై లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ అదే అంశాన్ని ప్రస్తావించబోతోంది. కులగణన కంటే అన్ని కులాలవారికి న్యాయం చేయడమే ప్రధాన లక్ష్యమని బీజేపీ వాదిస్తోంది. త్వరలోనే మహిళలను ఆకట్టుకునే కొన్ని స్కీములు రాబోతున్నాయని కూడా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.