తెలంగాణ సీఎం కేసీఆర్ మూడోసారి పార్టీని గెలిపించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు. మూడో సారి పార్టీ గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల నాటికి భారత రాష్ట్ర సమితిని మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో విస్తరించాలనుకున్నారు. తెలంగాణలో పదహారు సీట్లు… మహారాష్ట్రలో పాతిక సీట్లు సాధిస్తే నలభై సీట్లు వస్తాయని చక్రం తిప్పవచ్చని అనుకున్నారు. కానీ తను ఏ మాత్రం అవకాశం ఉండాలన్నా.. తెలంగాణలో పీఠం నిలబెట్టుకోవాలని ఆయనకు తెలుసు. కానీ ఆ విషయంలో ఫెయిలయ్యారు. ఇక జాతీయ రాజకీయాల్లో ఆయన కు ఉండే ప్రాధాన్యత దాదాపుగా సున్నా. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రివైవ్ కావడం కేసీఆర్‌కు పెద్ద టాస్కే.
జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు కేసీఆర్ జీరో
అదే సమయంలో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి జాతీయ రాజకీయాలు చేయడం కూడా సమస్యే. ఎందుకంటే… ఏ కూటమిలో చేరాలన్నా.. ఓ జాతీయ పార్టీ ఆ కూటమిలో ఉంటుంది. కాంగ్రెస్ కూటమిలో చేరే చాన్స్ లేదు. కాంగ్రెస్ చేతిలో ఓడిపోయి.. జాతీయ స్థాయిలో ఆ కూటమిలో చేరితే.. పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. బీజేపీ కూటమిలో చేరితే.. ముస్లిం, దళిత వర్గాలు దూరమవుతాయి. ఇక ధర్డ్ ఫ్రంట్ ఆలోచన అసలు చేయలేదు. అధికారం కూడా కోల్పోయినందున ఇతర రాష్ట్రాల నుంచి ఎవరూ బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి కూడా చూపించరు. అంటే కేసీఆర్ ఒంటరిగా పోటీ చేయలేరు.. వేరే కూటముల్లో చేరలేరు. అందుకే.. ఇక ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లు గెల్చుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు ప్రయత్నించే అవకాశం
తెలంగాణలో పదహారు సీట్లు… మహారాష్ట్రలో పాతిక సీట్లు సాధిస్తే నలభై సీట్లు వస్తాయని ఢిల్లీలో చక్రం తిప్పుతామని కేసీఆర్ ఇటీవలి కాలం వరకూ చెప్పారు. ఇలాంటి ఆశలు మిణుకు మిణుకుమనాలన్నా తెలంగాణలో పీఠం నిలబెట్టుకోవాలని ఆయనకు తెలుసు. కానీ ఆ విషయంలో ఫెయిలయ్యారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలోనే ఓడిపోయారు. ఇక జాతీయ రాజకీయాల్లో ఆయన కు ఉండే ప్రాధాన్యత దాదాపుగా సున్నా. కేసీఆర్ మూడో సారి గెలిచి ఉన్నట్లయితే.. ఓ చరిత్ర అనుకోవచ్చు. దేశంలో వరుసగా మూడు సార్లు గెలిచిన అరుదైన రికార్డు సాధించిన వారిలో ఆయన ఒకరయ్యేవారు. ఆయనకు దేశవ్యాప్తంగా ప్రచారం, క్రేజ్ వచ్చేవి. అంతేనా .. భారత రాష్ట్ర సమితిలో చేరికలు కూడా పెరిగేవి. దక్షిణాదిలో .. ఉత్తరాదిలో పార్టీని విస్తరించడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తన పార్టీ నుంచి వలసలు పోకుండా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అహంకారం తగ్గకపోతే కష్టమే !
కేసీఆర్ ఓటమిపై స్పందించలేదు. కనీసం గెలిచిన వారికి శుభాకాంక్షలు చెప్పలేదు. రాజకీయం అంటే.. సవాళ్లు. సీనియార్టీతో సంబంధం లేకుండా సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. బాగున్నప్పుడు చెడుగుడు ఆడేసి.. బాగోలేనప్పుడు ఇంట్లోనే కూర్చుంటానంటే ప్రజలు ఇప్పుడు ఆదరించడం లేదు. కేసీఆర్ రాజకీయం బీఆర్ఎస్ భవిష్యత్‌కు కీలకం కానుంది. కేసీఆర్ ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు కీలకం కానుంది.